Headlines

NEET యూజీ 2026 రాష్ట్ర ర్యాంకులు విడుదల.. టాప్‌ లేపిన హనుమకొండ విద్యార్థి | NEET UG 2026 Telangana State Rank List Released: Hanamkonda Student Sahyu Secures Telangana Top Rank, AIR 13

NEET యూజీ 2026 రాష్ట్ర ర్యాంకులు విడుదల.. టాప్‌ లేపిన హనుమకొండ విద్యార్థి | NEET UG 2026 Telangana State Rank List Released: Hanamkonda Student Sahyu Secures Telangana Top Rank, AIR 13


నీట్‌ యూజీ 2026 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు అఖిల భారత స్థాయిలో 13వ ర్యాంకు సాధించడంతో పాటు రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నీట్‌ యూజీ 2026 రాష్ట్ర ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈసారి నీట్‌ యూజీలో అర్హత సాధించిన 38,021 మంది తెలంగాణ అభ్యర్థుల వివరాలను వర్సిటీ ప్రకటించింది. అభ్యర్థుల రాష్ట్ర ర్యాంకు, నీట్‌ ర్యాంకు, రోల్‌ నంబర్‌, క్యాటగిరీ, సాధించిన మార్కుల వివరాలతో జాబితాను విడుదల చేసింది. వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో స్టేట్‌ టాప్‌ ర్యాంక్‌, బూర సాయి శరణ్‌ 701 మార్కులతో స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌, కందగట్ల హనీశ్‌ 700 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంక్‌, అందెం సాయిచరణ్‌ రెడ్డి 700 మార్కులతో స్టేట్‌ ఫోర్త్ ర్యాంకు, మయూక్‌ జయసింహ 700 మార్కులతో స్టేట్‌ ఫిఫ్త్ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు.

నీట్‌ యూజీలో మొత్తం 720 మార్కులకు గాను రాష్ట్ర టాపర్‌ సహ్యుకు 705 మార్కులు వచ్చాయి. ఇక రాష్ట్ర ర్యాంకుల చివరి భాగంలో 37,915 నుంచి 38,021వ ర్యాంకు వరకు ఉన్న 106 మంది అభ్యర్థులు 177 మార్కులు సాధించారు. వర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ జాబితా కేవలం స్థానిక ర్యాంకులకు మాత్రమే సంబంధించినదని తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొంది. అనంతరం తుది మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. నీట్‌ యూజీ 2026లో అఖిల భారత స్థాయిలో 3,047వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి తెలంగాణ రాష్ట్రంలో 100వ ర్యాంకు లభించింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపులో ఈ ర్యాంకులు కీలకంగా మారనున్నాయి.

గత ఏడాది సీట్ల కటాఫ్‌ ఇలా

2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి కటాఫ్‌ ర్యాంకులు ఈ కింది విధంగా ఉన్నాయి..

  • జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 50.. కటాఫ్ స్కోర్ 715 – 213
  • ఓబీసీ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. కటాఫ్ స్కోర్ 212 – 177
  • ఎస్సీ (SC) కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. 212 – 177
  • ఎస్టీ (ST) కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. 212 – 177
  • జనరల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 45.. కటాఫ్ స్కోర్ 212 – 194
  • ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. కటాఫ్ స్కోర్ 193 – 177
  • ఎస్సీ, పీడబ్ల్యూడీ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. కటాఫ్ స్కోర్ 193 – 177
  • ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలో కటాఫ్ పర్సంటైల్ 40.. కటాఫ్ స్కోర్ 191 – 177

వర్సిటీ వారీ కటాఫ్

  • జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కనీస అర్హత పర్సంటైల్ 50వ పర్సంటైల్గా ఉంది.
  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు 40వ పర్సంటైల్ అర్హతగా ఉంది.
  • దివ్యాంగుల (PwD) కేటగిరీల్లో కూడా ప్రత్యేక పర్సంటైల్ ప్రమాణాలు ఉన్నాయి.
  • కనీస అర్హత స్కోర్లు కేటగిరీ ఆధారంగా 177 నుంచి 213 మార్కుల వరకు ఉన్నాయి.
  • ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సుమారు 17,410 ఆల్‌ ఇండియా ర్యాంకు వరకు సీటు లభించింది.
  • గాంధీ మెడికల్‌ కాలేజీలో క్లోజింగ్‌ ర్యాంకు 7,613గా నమోదైంది.
  • ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలో 18,326 ర్యాంకు వరకు అవకాశం లభించింది.
  • వరంగల్‌ కేఎంసీలో 29,218 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి.

గత ఏడాది ఓపెన్‌ కేటగిరీలో చివరి ర్యాంకును పరిశీలిస్తే.. 416 మార్కులు సాధించిన అభ్యర్థికి 1,79,364 ఆల్‌ ఇండియా ర్యాంకుతో కుమురం భీం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు లభించింది. దాదాపు 2 లక్షల వరకు ర్యాంకు సాధించిన వారికి కూడా ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 9,550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలలు 36, ప్రైవేటు వైద్య కళాశాలలు 30 వరకు ఉన్నాయి. పెరిగిన సీట్ల కారణంగా ఈసారి కూడా దాదాపు 2 లక్షల వరకు ఆల్‌ ఇండియా ర్యాంకు సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ర్యాంకుల ప్రకటనతో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసే నోటిఫికేషన్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *