Headlines

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట | Good News for Hyderabad Metro passengers.. Big Relief for Students and employees


Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో రోజూ ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మెట్రోలో నెలవారీ (మంత్లీ) పాస్‌లు, మూడు నెలల (క్వార్టర్లీ) పాస్‌లు ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, ఉద్యోగులు, విద్యార్థులకు ఆర్థికంగా ఊరటనివ్వడం లక్ష్యంగా ఈ నిర్ణయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ అంశంపై అధికారులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

ఆర్టీసీ మోడల్‌ను పరిశీలిస్తున్న మెట్రో అధికారులు

ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో అమలవుతున్న వివిధ రకాల పాస్‌ల విధానాన్ని మెట్రోలో కూడా అమలు చేయవచ్చా అనే అంశాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో ఆర్టీసీ అధికారులతో సమావేశమై, ప్రస్తుతం అమలులో ఉన్న పాస్‌ల రకాలు, వాటి ధరలు, ప్రయాణికుల స్పందన, ఆదాయంపై ప్రభావం వంటి అంశాలను విశ్లేషించనున్నారు.ఆర్టీసీ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని మెట్రోకు అనువైన ప్రత్యేక పాస్‌లను రూపొందించే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులు, ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం

ప్రతిరోజూ కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులే మెట్రోలో అత్యధికంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్రయాణానికి విడివిడిగా టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో నెలాఖరుకు గణనీయమైన ఖర్చు అవుతోంది. మంత్లీ లేదా మూడు నెలల పాస్‌లు అందుబాటులోకి వస్తే వారికి ప్రయాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకే పాస్‌తో ప్రతిరోజూ ప్రయాణించే సౌకర్యం ఉండటంతో మెట్రో వినియోగం కూడా మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

రోజుకు 4.7 లక్షల మంది ప్రయాణం

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సగటున 4.70 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సంఖ్య దాదాపు స్థిరంగానే కొనసాగుతోంది. అయితే పండుగలు, వారాంతాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పాస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా రోజువారీ ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలో రాయితీలు.. ఇప్పుడు కొత్త ప్రణాళిక

హైదరాబాద్ మెట్రో ప్రారంభ దశలో కొన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్లు, ప్రత్యేక టికెట్లు అందుబాటులో ఉండేవి. వాటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ఆర్థిక నష్టాల కారణంగా ఆ పథకాలను నిలిపివేశారు. ఇప్పుడు మెట్రో నిర్వహణలో ప్రభుత్వ పాత్ర పెరగడంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా మళ్లీ ఆకర్షణీయమైన ప్రయాణ పథకాలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

ఆర్టీసీలో ఇప్పటికే 7 రకాల పాస్‌లు

తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం ఏడు రకాల పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ నెలవారీ పాస్‌లు, విద్యార్థుల రాయితీ పాస్‌లు, 24 గంటల ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ (TAYL) టికెట్లు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ వంటి విభిన్న సేవలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు. రోజుకు 80 వేల మందికి పైగా టీఏవైఎల్ టికెట్లు విక్రయమవుతుండగా, నెలవారీ పాస్‌లను సుమారు 75 వేల మంది వినియోగిస్తున్నారు. అదనంగా లక్ష మందికి పైగా విద్యార్థులు రాయితీ పాస్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

లక్షన్నర మందికి పైగా లబ్ధి పొందే అవకాశం

ఆర్టీసీ తరహాలో మెట్రోలో కూడా మంత్లీ పాస్‌లు అందుబాటులోకి వస్తే లక్షన్నర మందికిపైగా ప్రయాణికులు వాటిని వినియోగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడం, ట్రాఫిక్ రద్దీ తగ్గడం, ప్రజా రవాణా వినియోగం పెరగడం వంటి ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు మెట్రో కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావడంపై కూడా హైదరాబాద్ మెట్రో అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Gold Price Today: మరింతగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *