Headlines

కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు? | RSS chief Mohan Bhagwat to interact with Gen Z, Gen Alpha students in Mumbai on August 6

కొత్త తరంతో మోహన్ భగవత్ ముఖాముఖి.. దేశ భవిష్యత్తుపై ఏం చెప్పబోతున్నారు? | RSS chief Mohan Bhagwat to interact with Gen Z, Gen Alpha students in Mumbai on August 6


ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆగస్టు 6న ముంబైలో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) 15వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో జరగనుంది. IIMUN వార్షిక ఛాంపియన్‌షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ కార్యక్రమంగా నిర్వహించే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల నుంచి 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు 2,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ప్రజాస్వామ్యం, నాయకత్వం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. “ప్రపంచాన్ని భారతీయ పద్ధతిలో ఏకం చేయడంలో యువత పాత్ర” అనే అంశంపై మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. భారతదేశ భవిష్యత్ నిర్మాణంలో యువత పాత్ర, బాధ్యతలు, విలువల ఆధారిత నాయకత్వం వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సదస్సు ద్వారా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విద్యార్థులు చర్చించేందుకు, తమ ఆలోచనలను వ్యక్తపరచేందుకు వేదిక కానుంది.

ఈ కార్యక్రమంపై IIMUN వ్యవస్థాపకుడు రిషబ్ షా స్పందిస్తూ, నాయకత్వం అంటే కేవలం మార్గనిర్దేశం చేయడం మాత్రమే కాదని, తర్వాతి తరం ఆలోచనలు, ప్రశ్నలను వినడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతతో దేశంలోని ప్రముఖ ప్రజా నాయకుల్లో ఒకరైన మోహన్ భగవత్ నేరుగా సంభాషించడం విలువైన అవకాశమని ఆయన పేర్కొన్నారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించినందుకు భగవత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రిషబ్ షా కామెంట్స్ ఇక్కడ చూడండి..

2011లో రిషబ్ షా స్థాపించిన IIMUN యువ నాయకత్వం, పౌర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ప్రతి ఏడాది వందకు పైగా సమావేశాలు, వేలాది పౌర అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత్‌లోని 275 నగరాలు, ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది. 1.5 లక్షలకు పైగా పాఠశాలలు, కళాశాలలతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ, కోట్లాది మంది యువతను ప్రజాస్వామ్య చర్చల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్–యువత సమావేశం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *