Headlines

డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?

డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?


డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అయిందా..? ప్రమాదం జరిగితే బీమా డబ్బులు వస్తాయా? లేదా..?

డ్రైవింగ్ లైసెన్స్ ఉండటమే కాదు.. అది చెల్లుబాటులో ఉండటం కూడా అత్యంత కీలకమని సుప్రీంకోర్టు తాజా తీర్పుతో స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లేదా సకాలంలో రెన్యువల్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉండదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది వాహనదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా దానిని రెన్యువల్ చేసుకోకుండా వాహనాలు నడిపితే, ప్రమాదం జరిగిన సందర్భంలో భారీ ఆర్థిక భారం డ్రైవర్, వాహన యజమానిపైనే పడే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది.

2009లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. ఓం ప్రకాష్ అనే వ్యక్తి నడిపిన వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిపోయినట్లు తేలింది. అనంతరం లైసెన్స్ రెన్యువల్ చేసినప్పటికీ, ప్రమాదం జరిగిన తేదీన అది చెల్లుబాటులో లేకపోవడంతో బీమా కంపెనీపై నష్టపరిహారం బాధ్యత మోపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్–హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, లైసెన్స్ జారీ, పునరుద్ధరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించింది. అలాగే డ్రైవింగ్ స్కూళ్ల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, వాటి ఫీజులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.

ఈ తీర్పు నేపథ్యంలో వాహన యజమానులు, డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ గడువు తేదీని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. లైసెన్స్ గడువు ముగియకముందే దానిని పునరుద్ధరించుకోవడం ద్వారా చట్టపరమైన ఇబ్బందులు, భారీ నష్టపరిహారం వంటి సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *