Headlines

ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? | Suspended Trainee IPS Uday Krishna Reddy Discharged From Hospital, Woman Safety Wing Speeds Up Probe, Latest Updates

ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? | Suspended Trainee IPS Uday Krishna Reddy Discharged From Hospital, Woman Safety Wing Speeds Up Probe, Latest Updates


కానిస్టేబుల్ స్థాయి నుంచి పట్టుదలతో శ్రమించి సివిల్స్ సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ఒక్కో రోజు ఒక్కో మలుపు తిరుగుతున్న ట్రైనీ ఐపీఎస్ కేసులో దర్యాప్తు స్పీడప్‌ అయింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ SRనగర్‌ జయంతి ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి.. లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై ఉమెన్ సేఫ్టీ వింగ్‌ విచారణను వేగవంతం చేసింది. ఉన్నతాధికారులు ఈ కేసును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లారు. అకాడమీ పోలీసు అధికారుల సమక్షంలో బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఈ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి స్టేట్‌మెంట్, డిజిటల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను బేరీజు వేస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. తప్పుడు ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని ఉదయ్‌ కృష్ణారెడ్డి పిటిషన్‌లో కోరారు. దీంతో కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారని.. అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలంటూ అతని తరఫు న్యాయవాది కోరినా హైకోర్టు అంగీకరించలేదు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణాపై నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కేసు నమోదైంది. తోటి మహిళా ట్రైనీని అతను వేధించినట్లు, కొట్టినట్లు కూడా కేసు పెట్టారు. ఆ ఘటన తర్వాత ఆతన్ని NPA నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు అధికారులు. మొన్నటి ఈ ఘటన తర్వాత SR నగర్‌లోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చిన ఉదయ్‌ని అపస్మారక స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు కుటుంబీకులు. పక్కనే శానిటైజర్ బాటిల్ పడి ఉండడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావించారు. అయితే ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఆల్కహాల్‌ ఓవర్ డోస్ తప్ప ఎలాంటి పాయిజనస్ కంటెంట్ బాడీలో లేదని తేల్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *