ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వ్యర్థం నుంచి సంపద సృష్టించే గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకం, అస్సాంలో గువాహటి-తేజ్‌పూర్ 4 లేన్ హైవే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.32,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.23,731 కోట్లతో గోబర్ధన్ పథకం
రూ.23,731 కోట్లతో గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు అమలు కానుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుంది. దీనివల్ల దిగుమతి సహజవాయువుపై ఆధారపడటం తగ్గి ఇంధన భద్రత బలపడుతుంది. రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, సహకార సంఘాలకు కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సిజీడీ సంస్థల ద్వారా సీబీజీ కొనుగోలుకు జరగనుంది. 2026-27లో 3 శాతం, 2027-28లో 4 శాతం, 2028-29 నుంచి 5 శాతంగా ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారు.
సీబీజీకి ప్రతి ఎంఎంబీటీయూకు రూ.2,110 స్థిర పరిపాలనా ధర నిర్ణయించారు. కొత్త సీబీజీ ప్లాంట్లకు ప్రతి టీపీడీ సామర్థ్యానికి గరిష్ఠంగా 2 కోట్ల మూలధన సహాయం అందుతుంది. ప్లాంట్లను గ్యాస్ పైప్‌లైన్లతో అనుసంధానించేందుకు ప్రత్యేక మౌలిక వసతులు, ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారంటీ సౌకర్యం, జిల్లాల వారీగా సీబీజీ అభివృద్ధికి ప్రత్యేక ఛాలెంజ్ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు, స్వచ్ఛ ఇంధన వినియోగానికి ఈ పథకం ఊతమిస్తుంది. వేస్ట్ టు వెల్త్, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు ఇది కీలకమైన పథకంగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అస్సాంలో గౌహతి-తేజ్‌పూర్ 4 లేన్ హైవే
కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అస్సాంలో గౌహతి-తేజ్‌పూర్ మధ్య 8,970.20 కోట్లతో 4 లేన్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్-15పై 135.87 కిలోమీటర్ల యాక్సెస్-కంట్రోల్డ్ హైవేను బీఓటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) టోల్ విధానంలో అమలు చేస్తారు. తేజ్‌పూర్ బైపాస్‌లో 4.9 కి.మీ అత్యవసర విమానాల ల్యాండింగ్ సౌకర్యం (ఈఎల్‌ఎఫ్) ఏర్పాటు చేస్తారు. బైహాటా చరియాలి, సిపాజార్, ఖరుపేటియా, డెకియాజులి, తేజ్‌పూర్ ప్రాంతాల్లో 5 ప్రధాన బైపాస్‌లు (మొత్తం 58.7 కి.మీ) నిర్మిస్తారు. దీనితో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. 15 ప్రధాన వంతెనలు, 30 చిన్న వంతెనలు, 19 ఫ్లైఓవర్లు, 46 అండర్‌పాస్‌లు, 210 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. తేజ్‌పూర్ బైపాస్‌లో ఏనుగుల కోసం ప్రత్యేక అండర్‌పాస్ కూడా ఏర్పాటు చేస్తారు.ఈ ప్రాజెక్టుతో ప్రయాణ వేగం రెట్టింపు అవుతుంది. ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్యం, వాహన నిర్వహణ ఖర్చుల్లో మెరుగుదల ఉంటుంది. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య వేగవంతమైన అనుసంధానం ఏర్పడుతుంది. 8 పీఎం గతిశక్తి ఆర్థిక కేంద్రాలు, 2 ఆకాంక్ష జిల్లాలు, 3 పర్యాటక కేంద్రాలు, 7 లాజిస్టిక్ హబ్‌లకు మెరుగైన కనెక్టివిటీ చేకూరుతుంది.కేంద్ర కేబినెట్ నిర్ణయాలు గ్రామీణ ఆదాయం పెంపు, శుభ్ర ఇంధనం, ఈశాన్య భారత్ అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.