Headlines

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..? | Who is Rahul Gandhi’s favourite BJP politician? Congress leader reveals in Instagram ‘Ask Me Anything’ with Gen Z

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..? | Who is Rahul Gandhi’s favourite BJP politician? Congress leader reveals in Instagram ‘Ask Me Anything’ with Gen Z


కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జెన్ జెడ్‌ (Gen Z) యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (Ask Me Anything) సెషన్ నిర్వహించారు. విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, మహిళా విద్య, రాజకీయాలు వంటి అంశాలతో పాటు బాట్‌మాన్ వంటి సరదా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్న రాహుల్ గాంధీ.. “విద్యార్థులారా, జెన్-జెడ్.. నేను వినడానికి ఇక్కడ ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఏదైనా అడగండి. వీలైనన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను” అని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయన సమాధానాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనపై ప్రశ్నించగా.. దేశ విద్యా వ్యవస్థ ‘కుప్పకూలిపోయిందని’ రాహుల్ గాంధీ విమర్శించారు. కోటా, డెహ్రాడూన్‌లలో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని, విద్యార్థుల సమస్యలను అన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

మహిళలకు సమాన అవకాశాలు

విద్యా హక్కుల కోసం పోరాడుతున్న యువతులకు సందేశం ఏమిటని అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. జీవితంలోని ప్రతి రంగంలో మహిళలకు సమానమైన, అవసరమైతే అంతకంటే ఎక్కువ అవకాశాలు లభించాలని అన్నారు. భారత మహిళలే దేశానికి అతిపెద్ద బలమని పేర్కొంటూ.. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా, శక్తివంతంగా ముందుకు సాగాలని సూచించారు.

బీజేపీలో ఇష్టమైన నాయకుడు ఎవరంటే?

సంభాషణలో సరదా ప్రశ్నలూ ఎదురయ్యాయి. బీజేపీలో తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరని అడగ్గా.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్ ప్రస్తావించారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని, సైనిక చరిత్రపై ఆయనకున్న పరిజ్ఞానాన్ని ప్రశంసించారు.

“మీరు బాట్‌మాన్ అవునా?”

“మీరు బాట్‌మాన్ అవునా?” అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ నవ్వుతూ.. “నన్ను, బాట్‌మాన్‌ను ఒకే గదిలో ఎవరూ ఎప్పుడూ చూడలేదని అనుకుందాం” అంటూ చమత్కరించారు. నను ప్రభావితం చేసిన తత్వవేత్తలు, ఆలోచనాపరుల గురించి మాట్లాడుతూ బుద్ధుడు, గురు నానక్, బసవన్న, శంకరదేవ్, బిర్సా ముండా, పెరియార్, మహాత్మా ఫూలే, నారాయణ గురు, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ తదితరుల ఆలోచనలను ప్రస్తావించారు.

యువ ఓటర్లతో నేరుగా కనెక్ట్

ఇటీవల నీట్ పేపర్ లీక్‌పై నిరసన తెలిపిన విద్యార్థులను కలిసిన మరుసటి రోజే ఈ ఇన్‌స్టాగ్రామ్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులు, యువ ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు రాహుల్ గాంధీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా జెన్ జెడ్ ఓటర్లను ఆకట్టుకునేందుకు డిజిటల్ వేదికలపై తమ కార్యకలాపాలను పెంచుతున్నారు.

రాహుల్ గాంధీ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *