ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది 2026 సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా మందిలో భయం, సందేహాలు, జ్యోతిష్య ప్రభావాలపై చర్చ మొదలవుతుంది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం లేదా ఆలయ ఆచార నియమాలు వర్తించవు. కాబట్టి గ్రహణం కారణంగా భయపడాల్సిన అవసరం లేదు.
అయినప్పటికీ, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాల ప్రభావం రాశులపై ఉంటుందని విశ్వసిస్తారు. ఆ కోణంలో చూస్తే, ఈ సూర్యగ్రహణం 12 రాశులపై భిన్నమైన ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా మూడు రాశుల వారు కొంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
సింహ రాశి (Leo): సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ గ్రహణం ప్రభావం ఈ రాశి వారిపై కొంత ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా మాట్లాడే మాటల్లో సంయమనం పాటించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం శ్రేయస్కరం. కష్టపడి చేసిన పనులకు ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అప్పులు పెరగడం లేదా అనుకోని ఖర్చులు రావడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది.
కన్య రాశి (Virgo): కన్యారాశి వారికి ఈ కాలంలో ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు లేదా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారు లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి కుటుంబ, ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అప్పులు లేదా అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితంలో లేదా కుటుంబ సభ్యులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచి సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు పెద్దవి కాకుండా నివారించవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం చేయకుండా, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.
(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు జ్యోతిష్య విశ్వాసాలు, ప్రచారంలో ఉన్న అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకంతో వ్యవహరించడం మంచిది.)




