Headlines

KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..? | King Jackie Queen Movie Review starring Dikshit Shetty

KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..? | King Jackie Queen Movie Review starring Dikshit Shetty


మూవీ రివ్యూ: కింగ్ జాకీ క్వీన్ (KJQ)

నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, రేఖా నిరోషా, మురళీధర్ గౌడ్, సురేఖ వాణి, మణిక చిక్కాల, మీసాల లక్ష్మణ్ తదితరులు

ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని

ఇవి కూడా చదవండి



సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్

సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కేకే (దివంగత కిరణ్ కుమార్)

కథ:

తల్లిదండ్రులు లేని పార్థ (దీక్షిత్ శెట్టి) చిన్నప్పటి నుంచి జనం అవమానాలను భరిస్తూ పెరుగుతాడు. ఆ కసితో ఎలాగైనా గొప్పవాడు కావాలని, పట్టణాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అడ్డువచ్చిన వారిని ఎదుర్కొంటూ ఓ పెద్ద డాన్ స్థాయికి చేరుకుంటాడు. అతడికి చిచ్చా (మురళీధర్ గౌడ్) సాయం చేస్తాడు. ఆ క్రమంలోనే కమల్ దాస్ అనే పెద్ద మనిషి కూతురు (రేఖ నిరోషా) మెడలో తాళి కట్టి, మొత్తం నగరాన్ని శాసించే స్థాయికి వెళ్తాడు. మరోవైపు, ఓ పోలీస్ ఆఫీసర్‌ను హతమార్చిన జాకీ (శశి ఓదెల) అనే కుర్రాడికి ఆశ్రయం ఇచ్చి స్వంత సోదరుడిలా చూసుకుంటాడు పార్థ. ఇలా సాగుతున్న వీరి ప్రయాణంలో భార్గవి (యుక్తి తరేజా) అనే హీరోయిన్ ప్రవేశిస్తుంది. తన వేడుకలో చిందులు వేయమన్న పార్థ కోరికను ఆమె తిరస్కరిస్తుంది. దీంతో పంతానికి పోయిన డాన్, ఆమెను తన వశం చేసుకోవాలని ప్లాన్స్ వేస్తాడు. ఈలోపు తన భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడని భావించిన పార్థ భార్య, అతడిని దారికి తెచ్చే బాధ్యతను జాకీకి అప్పగిస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో భార్గవి, జాకీలు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక చిత్రం బయటకు వస్తుంది. అప్పటిదాకా ప్రాణంగా ఉన్న అన్నదమ్ముల బంధం ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ హీరోయిన్ గతం ఏమిటి? వాళ్ళ బాల్యం ఎలా గడిచింది? ఇవన్నీ స్క్రీన్ మీద చూడాల్సిందే..

కథనం:

నాగార్జునతో ‘కేడి’ లాంటి భిన్నమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు కేకే చాలా కాలం విరామం తీసుకుని ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆయన అనారోగ్యంతో కన్నుమూయడం విషాదకరం. అందుకే ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి కాస్త సమయం పట్టింది. ఇక పోతే సినిమా ఫస్టాఫ్ అంతా ప్రధాన త్రయం పరిచయాలు, ఇద్దరు కుర్రాళ్లు చీకటి సామ్రాజ్యంలో ఎలా ఎదిగారు, జాకీ ప్రేమ వ్యవహారం, వాళ్ళ మాఫియా పనులు, పెళ్లి తంతు.. ఇలా నెమ్మదిగా సాగుతుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలుగుతుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు హీరోయిన్ ప్రవేశించడం, డాన్ అహంకారం దెబ్బతినడం, అలాగే తమ్ముడి వరుస అయ్యే కుర్రాడితో ఆ హీరోయిన్ చనువుగా ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం వంటి మలుపులతో ద్వితీయార్ధం మీద ప్రేక్షకుడిలో ఒకరకమైన ఉత్కంఠ పెరుగుతుంది. ఆ తర్వాత అంతా హీరోయిన్ గతం చుట్టూ తిరుగుతుంది. ముగింపులో ఆ అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుల్లాంటి ఇద్దరి మధ్య జరిగిన పోరు, ఆ డాన్ జీవితం ఏ తీరానికి చేరిందనేది ఆసక్తికరంగా మలిచారు. దిక్కులేని వాడు పెద్ద రౌడీగా మారడం అనేది పాత పాయింటే. అందులో పెద్దగా కొత్తదనం లేదు. గతం తాలూకు సీన్స్ అన్నీ మనం ముందే పసిగట్టేలా ఉంటాయి. కాకపోతే మనిషిలోని పొగరు అతడిని ఎలా పాతాళానికి తొక్కుతుంది, దానివల్ల ఏమేం కోల్పోతాడనే ఒక మంచి సందేశాన్ని ఇక్కడ ఇచ్చారు. యాక్షన్ ప్రియులకు కావాల్సినంత ఫైట్స్, యువతకు నచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్, అక్కడక్కడా హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఈ ప్రయాణంలో కనిపిస్తాయి. రొటీన్ పాయింట్ అయినా సరే, దాన్ని నడిపించిన విధానం బాగానే కుదిరింది.

నటీనటులు:

ప్రతినాయక లక్షణాలున్న ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి తనదైన శైలి నటనతో అదరగొట్టేశాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెలకు ఇది తొలి అడుగు అయినప్పటికీ, కెమెరా ముందు చాలా సహజమైన నటన కనబరిచాడు. గ్లామర్ ఒలకబోయడంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న రోల్‌లో యుక్తి తరేజా మెప్పించింది. మిగిలిన వాళ్ళలో మురళీధర్ గౌడ్, భార్యగా చేసిన రేఖ నిరోషా తమ పరిధి మేరకు న్యాయం చేశారు. సురేఖ వాణి, మణిక చిక్కాల, మీసాల లక్ష్మణ్ తదితరులు తమ పాత్రల మేరకు సహాయ పడ్డారు.

టెక్నికల్ టీం:

పూర్ణచంద్ర తేజస్వి అందించిన నేపథ్య సంగీతం, పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. నగేష్ బానెల్ కెమెరా పనితనం తెరపై చాలా రిచ్‌గా కనిపిస్తుంది, విజువల్స్ ఆకట్టుకుంటాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ విభాగానికి వస్తే, ఫస్ట్ హాఫ్‌లో సాగదీతగా అనిపించే కొన్ని షాట్స్ కత్తిరించి ఉంటే ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. కానీ అక్కడ ఛాన్స్ లేదు.. ఎందుకంటే సినిమా నిడివి 1.50 గంటలు మాత్రమే ఉంది. దర్శకుడు కిరణ్ కుమార్ పాత పాయింట్ తీసుకున్నా, కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చి సాంకేతికంగా సినిమాను ఉన్నతంగానే మలిచారు. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టినట్లు ఫ్రేమ్ ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా తెలుస్తుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా KJQ.. ముగ్గురి అస్తిత్వ పోరాటం.. క్రైమ్ యాక్షన్ డ్రామా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *