Headlines

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses


Mana Jampala AI: 12 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? బడికి వెళ్లడం, ఆడుకోవడం, టీవీ చూడటం.. ఇవే కదా! కానీ, ఓ బాలిక మాత్రం ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని స్థాపించింది. పన్నెండేళ్ల వయసులోనే వ్యాపార ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆమె పేరు మానా జంపాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు తన ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తోంది. మానా జంపాల కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే పైథాన్ (Python) కోడింగ్ నేర్చుకుంది. పదేళ్లు వచ్చే సరికి టెక్నాలజీపై పట్టు సాధించింది. 11 ఏళ్ల వయసులోనే ఏఐ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ‘వోక్సా’ (Voxa) అనే స్టార్టప్ కంపెనీని స్థాపించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీకి తానొక ఉదాహరణగా మారింది. కెనడా, ఇండియా, కంబోడియా లాంటి దేశాల్లోని ఎన్నో వ్యాపార సంస్థలు ఇప్పుడు వోక్సా సేవలను వినియోగించుకుంటున్నాయి. కస్టమర్ల ఫోన్ కాల్స్ మాట్లాడటం, రోజువారీ పనులను ఆటోమేట్ చేయడం ఈ ఏఐ ప్రధాన ఉద్దేశం. చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన రావడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.

తన తండ్రి ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కస్టమర్లకు సేవలు అందించే క్రమంలో బిజీగా ఉండటం మానా గమనించింది. పని ఒత్తిడి వల్ల చాలా ఫోన్ కాల్స్ మాట్లాడలేకపోవడం చూసింది. ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. దానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆలోచించింది. ఆ ఆలోచన నుంచే పుట్టిందే ‘వోక్సా’. ఇది ఒక ఏఐ రిసెప్షనిస్ట్. రోజులో 24 గంటల పాటు కస్టమర్ల ఫోన్ కాల్స్ మాట్లాడుతుంది. అపాయింట్మెంట్లు బుక్ చేస్తుంది. రెస్టారెంట్లలో ఆర్డర్లు తీసుకుంటుంది. కస్టమర్లతో ఫాలో అప్ చేస్తుంది. దీని వల్ల వ్యాపార సంస్థలకు ఒక్క కస్టమర్ కూడా దూరం కారు. ఏ ఆటంకం లేకుండా వ్యాపారం సాగిపోతుంది.

ఈ ప్రయాణంలో మానా జంపాల ఎవరిపైనా ఆధారపడలేదు. తన ప్రోడక్ట్ కోసం ఏఐని గుడ్డిగా వాడలేదు. చాట్ జీపీటీ (ChatGPT), క్లాడ్ (Claude) లాంటి టూల్స్ ఉపయోగించి చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్స్ రాసుకుంది. వాటన్నింటినీ స్వయంగా టెస్ట్ చేసింది. అందులో ఉన్న బగ్స్ (లోపాలు) పరిష్కరించుకుంది. సాఫ్ట్‌వేర్ తయారీలోని ప్రతి దశను స్వయంగా నేర్చుకుంది.
ఇప్పుడు ‘వోక్సా ఏజెంట్స్’ (Voxa Agents) అనే మరో అద్భుతమైన ఫీచర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఎవరైనా సరే.. సాదాసీదా ఆంగ్ల భాషలో ఒక పనిని వివరిస్తే చాలు, ఆ పనిని పూర్తి చేసే అటానమస్ ఏఐ ఏజెంట్లను సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఇది సాధ్యపడుతుంది.

ఏఐ విప్లవం కేవలం అనుభవజ్ఞులైన టెక్ నిపుణుల సొంతం కాదని మానా నిరూపిస్తోంది. ఆసక్తి, నేర్చుకోవాలనే తపన ఉన్న చిన్న పిల్లలు కూడా టెక్నాలజీలో అద్భుతాలు చేయగలరని చాటిచెబుతోంది. ఏదైనా సాధించడానికి వయసు అడ్డుకాదని, మొదలుపెట్టడమే ముఖ్యమని మానా జంపాల విజయగాథ మనకు స్పష్టం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *