Headlines

Ration Shop: రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. అక్కడ కూడా రేషన్ షాపులు.. ఇక పండుగే.. | Andhra pradesh government Expands Ration Shops: New Stores to Come Up Near TIDCO Housing Complexes

Ration Shop: రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. అక్కడ కూడా రేషన్ షాపులు.. ఇక పండుగే.. | Andhra pradesh government Expands Ration Shops: New Stores to Come Up Near TIDCO Housing Complexes


ఏపీలోని కూటమి సర్కార్ రేషన్ షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపులను మరింత విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రజలు సులువుగా రేషన్ పొందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కూడా రేషన్ షాపులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టిడ్కో ఇళ్లు సిటీలు, పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో నిర్మించారు. దీంతో ఇక్కడ నివాసం ఉండేవారు రేషన్ సరుకులు తీసుకోవాలంటే అవస్థలు పడుతున్నారు. ఎక్కడో దూరంగా ఉండే రేషన్ షాపులకు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. గతంలో వాళ్లు నివాసం ఉన్న ఏరియాకు వెళ్లి రేషన్ తీసుకోవడం కష్టంగా మారింది.

ప్రస్తుతం నివాసం ఉంటున్న టిడ్కో ఇళ్ల నుంచి రేషన్ కోసం నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. టిడ్కో ఇళ్ల హౌసింగ్ కాంప్లెక్స్‌ల దగ్గర రేషన్ షాపుల ఏర్పాటుకు ముందడుగు వేసింది. ఇళ్లకు దగ్గర్లో కొత్త రేషన్ షాపులను నెలకొల్పనుంది. 117 చోట్ల కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుంది. ఎన్ని రేషన్ షాపులను అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారుల నుంచి పౌరసరఫరాలశాఖ నివేదిక కోరింది. రెండు, మూడు రోజుల్లో అధికారులు అంచనా వేసి పౌరసరఫరాల శాఖకు రిపోర్ట్ అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా రేషన్ షాపులను అవసరమైన చోట అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఏపీలో 500 నుంచి వెయ్యి కుటుంబాలకు సగటున ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 163 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు ఉన్నాయి. ఒక్కొచోట 500 నుంచి 10 వేల మంది నివాసం ఉంటున్నారు. వీటిల్లో 70 టిడ్కో ఇళ్లు సముదాయాలను లబ్దిదారులను కేటాయించారు. మరో 40 చోట్ల పాక్షికంగా పనులు పూర్తి చేసి అందించారు. ఈ నెలాఖరులోగా మరో 7 చోట్ల లబ్దిదారులకు అప్పగించనున్నారు. దీంతో ఈ సమీప ప్రాంతాల్లో రేషన్ షాపులను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీని వల్ల టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉండేవారు ఎక్కువ దూరం వెళ్లాల్సిన పని ఉండదు. సమీపంలోని షాపుకు వెళ్లి రేషన్ తీసుకోవచ్చు. త్వరలోనే ఈ షాపులను ప్రభుత్వం నెలకొల్పేందుకు సిద్దమవుతోంది. కాగా కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక రేషన్ వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలు తీసుకొస్తుంది. ఇప్పటికే కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. అలాగే బియ్యం, పంచదారతో పాటు రాగులు, జొన్నలు వంటివి కూడా పంపిణీ చేస్తున్నారు. వీటికి అనుసంధానంగా మినీ మార్టులు కూడా నెలకొల్పింది. ఈ మినీ మార్టుల్లో తక్కువ ధరకు నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *