కర్రెగుట్టల్లో చరిత్రాత్మక అడుగు పడింది.. ప్రకృతి అందాలకు ఆలవాలం.. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన కొండలు కలిగిన కర్రెగుట్టలపైకి చేరుకున్న రాష్ట్ర డీజీపీ CV ఆనంద్ ఈ గుట్టలకు ప్రశాంతత లభించిందని పరవశించి పోయారు. నిత్యం రక్తం పారిన చోట.. తుపాకులు గర్జించిన బాటలో శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేసి ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రకటించారు
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ఒకప్పుడు కీలక స్థావరంగా, అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరొందిన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి ప్రభుత్వ అధికారుల బృందం అధికారికంగా కర్రెగుట్టలపైకి రావడం ఇదే తొలిసారి అని డీజీపీ పేర్కొన్నారు. కర్రెగుట్టల్లో డీజీపీ పర్యటన సాహస యాత్రల సాగింది.
పర్వతారోహణంలో తెలంగాణలో ఎత్తైన కొండ డోలిగుట్ట.. 964 మీటర్ల ఎత్తులో ఉన్న డోలిగుట్ట కర్రెగుట్టలో ఒక భాగం. ఎత్తైన కొండలు.. మారుమూల ప్రాంతం కావడంతో గతంలో కర్రెగుట్టలు మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా ఉండేవి. మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా ఉపయోగించు కోవడంతో పాటు డెన్లను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించేవారు
గతంలో గ్రేహౌండ్స్, కోబ్రా, CRPF దళాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి వెళ్లేవి తప్ప ప్రభుత్వ అధికారుల బృందం గుట్టల పైకి రావడం ఇదే ప్రథమం అని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేశారు. అయితే గత రెండేళ్లలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బలగాలు, కేంద్ర భద్రతా బలగాల సమన్వయంతో నిర్వహించిన ఖగార్ ఆపరేషన్లతో కర్రెగుట్టల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని ఆయన తెలిపారు. మావోయిస్టు నాయకత్వంలోని కీలక నేతలు, దళ సభ్యులు లొంగిపోవడం, కొందరు ఆపరేషన్లలో మృతి చెందడం, మరికొందరు ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని డీజీపీ అన్నారు.
కర్రెగుట్టల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.. ఇంతకాలం భద్రతా కారణాలతో దూరంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.. “కర్రెగుట్టలపైకి ములుగు జిల్లా కలెక్టర్ ఇతర అధికార బృందంతో కలిసి చేరుకున్న డిజిపి శాంతి కపోతాలు పావురాలను ఎగురవేశారు.. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆనందంతో మురిసిపోయారు. అధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని డీజీపీ తెలిపారు.
కర్రెగుట్టల ప్రాంతానికి రాకపోకలు సులభతరం చేసేందుకు గత ఆరు నెలలుగా అధికారులు తీవ్రంగా శ్రమించారు. వెంకటాపురం మండలంలోని పామునూరు, మురుమూరు, జల్లా, డోలి, తడపాల వరకు సుమారు 33 కిలోమీటర్ల తెలంగాణ సరిహద్దులో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ రహదారిని మరింత అభివృద్ధిచేసి రాబోయే రోజుల్లో కర్రెగుట్టల వరకు బీటీ రోడ్డు నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ సేవలు కూడా సులభంగా చేరే అవకాశం ఉందన్నారు.
కర్రెగుట్టల సహజ అందాలను ఉపయోగించుకుని పర్యాటక అభివృద్ధికి అవకాశాలను పరిశీలిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఇక్కడ నివసించే గిరిజనులకు ఆదాయం పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపై విశ్లేషణ జరుగుతోందన్నారు.. స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామన్నారు.
బాహ్య ప్రపంచానికి దూరంగా కర్రెగుట్టలపై నివశిస్తున్న పామునూరు గ్రామస్తులకు డీజీపీ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్, ఇతర పోలీస్ అధికారాల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, జీవన పరిస్థితులపై ఆరా తీశారు. పోలీసు శాఖ ప్రజలకు అండగా ఉంటుందని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
మావోయిస్టులు లొంగిపోవడం తర్వాత వారి పునరావాసం, ఉపాధి, జీవనాధారం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. వారు ఇకపై ఏం చేయాలనుకుంటున్నారు..!, వారికి ఎలాంటి ఉపాధి కల్పించాలి.. సమాజంలో సాధారణ జీవితం ఎలా కొనసాగించాలనే అంశాలపై చర్చించి వారికి హెల్త్ కార్డ్స్ అందజేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు.
ఇంకా మావోయిస్టు సెంట్రల్ కమిటీకి చెందిన సభ్యులు సహా కొద్దిమంది అగ్రనేతలు మిగిలి ఉన్నారని డీజీపీ తెలిపారు. సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతితోపాటు ఆయన భార్య కూడా లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని సూచించారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన, సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న మరో 17 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలని సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.
మొత్తం మీద కర్రెగుట్టల కథ మారింది.. ఈ పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు మావోయిస్టుల స్థావరంగా, భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లకు మాత్రమే పరిమితమైన కర్రెగుట్టలు.. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల అడుగులతో కొత్త దిశగా పయనిస్తున్నాయి. భద్రతా పరిస్థితులు మెరుగు పడటంతో రహదారులు, మౌలిక వసతులు, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కర్రెగుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన ఈ మార్పునకు ప్రతీకగా నిలిచిందని అధికారులు భావిస్తున్నారు..అన్నల కథ ముగిసింది.. మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి బాటలు పడతాయో వేచిచూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..