Headlines

Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids

Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids


కోకాపేట్‌లోని ఖరీదైన భూముల వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రంగం సిద్ధం చేసింది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూములను వేలం వేయనుండగా.. వీటికి భారీ ధరలు పలికే అవకాశం ఉంది. నియోపోలిస్‌లో ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్‌లో ఎకరాకు రూ.70 కోట్లుగా HMDA నిర్ణయించింది. కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఆ వేలం ద్వారా HMDAకు సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ఒక భూమి ఎకరం రూ.131 కోట్లకు, మరో భూమి ఎకరం రూ.118 కోట్లకు విక్రయమైంది. అంతకుముందు మూడు దశల్లో నిర్వహించిన వేలాల ద్వారా HMDAకు సుమారు రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా వేలంలోనూ కోకాపేట్ భూములకు మరింత పోటీ నెలకొని.. అప్‌సెట్ ధరల కంటే ఎక్కువ ధరలు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

HMDA భూముల వేలాలను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహించనుంది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూముల వేలం సెప్టెంబర్ 9న జరగనుంది. నియోపోలిస్‌లో వేలానికి ఉంచుతున్న భూమి విస్తీర్ణం 4.59 ఎకరాలు కాగా.. గోల్డెన్ మైల్‌లోని భూమి 0.70 ఎకరాలు ఉంది. కోకాపేట్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న నివాస లేఅవుట్లు, ఇతర భూములను కూడా HMDA వేలం వేయనుంది. కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్, మొయినాబాద్ పరిధిలోని మొకిల, బాచుపల్లి, కొత్తూరు సమీపంలోని ఇన్ముల్ నర్వ లేఅవుట్, గండిపేట మండలంలోని బైరాగిగూడ, చందానగర్, సూరారం, కాప్రా, కిస్తారెడ్డిపేట, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లోని భూములు ఈ వేలం జాబితాలో ఉన్నాయి.

మొకిలలో 300 నుంచి 500 చదరపు గజాల స్థలాలకు చదరపు గజానికి రూ.55 వేల కనీస ధరను HMDA నిర్ణయించింది. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.45 వేల కనీస ధరగా ఖరారు చేసింది. అలాగే 2,420 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఓ భూమికి చదరపు గజానికి రూ.75 వేల అప్‌సెట్ ధరను నిర్ణయించింది. సూరారంలో 4,840 చదరపు గజాల స్థలానికి చదరపు గజానికి రూ.55 వేల కనీస ధరను HMDA ఖరారు చేసింది. కోకాపేట్‌లో ఇప్పటికే భారీ ధరలకు భూములు విక్రయమైన నేపథ్యంలో.. తాజా వేలంలో నియోపోలిస్, గోల్డెన్ మైల్ భూములకు ఎలాంటి ధరలు పలుకుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *