Headlines

Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్! | Hyderabad: Attempted ATM theft in Miyapur; two arrested, another accused at large

Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్! | Hyderabad: Attempted ATM theft in Miyapur; two arrested, another accused at large


హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నించిన ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోక పోవడంతో నగదు చోరీ కాలేదు. కానీ ఏటీఎంకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీలను మాత్రం ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిందితులు తెల్లవారుజామున ఏటీఎం వద్దకు చేరుకుని ముందుగా పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఒకరు బయట కాపలాగా ఉండగా.. మరో ఇద్దరు ఏటీఎం లోపలికి వెళ్లారు. ఇనుప రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నగదు ఉన్న భాగాన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో నగదు తీసుకోలేకపోయారు. అయితే అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను మాత్రం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనాస్థలంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సంజీవ్ జాదవ్ (40), రాపాక సూర్య ప్రకాశ్ రావు (55) లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వాదిత్య కార్తిక్ (22) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురూ కలిసి చోరీకి స్కెచ్ వేయగా.. ఒకరు బయట కాపలాగా ఉండి పరిస్థితిని గమనిస్తుండగా, ఇద్దరు లోపలికి వెళ్లి ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒక ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఏటీఎంల భద్రత విషయంలో బ్యాంకులు, నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఏటీఎం కేంద్రాల వద్ద పనిచేసే సీసీటీవీ కెమెరాలతో పాటు తగినంత వెలుతురు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *