Headlines

మద్యం చూసి టెమ్ట్ అయిన దొంగలు.. అసలు విషయం మర్చిపోయి ఫుల్లుగా తాగేసి..


మద్యం చూసి టెమ్ట్ అయిన దొంగలు.. అసలు విషయం మర్చిపోయి ఫుల్లుగా తాగేసి..

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి వద్ద ఉన్న ఒక దాబాలో అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు దొంగల ముఠా అర్థరాత్రి దాబా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. ముందుగా అక్కడ ఉన్న కొన్ని విలువైన వస్తువులను సర్దుకుని తమతో పాటు బయటకు తీసుకెళ్లారు. మిగిలిన సామగ్రిని కూడా దోచుకోవాలనే ఉద్దేశంతో వారు రెండోసారి మళ్లీ దాబా లోపలికి వచ్చారు. అయితే, అక్కడ పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యం సీసాలు వారికి కనిపించాయి. దాంతో అసలు వచ్చిన పనిని మరిచిపోయి, దాబాలోనే విందు చేసుకున్నారు. ఉదయం తెల్లవారే వరకు ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో మునిగిపోయారు.

ఉదయాన్నే దాబా తెరిచేందుకు వచ్చిన యజమానికి లోపల దొంగలు మత్తులో ఉండటం కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆయన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖమ్మం రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన దాబా వద్దకు చేరుకునే సమయానికి విషయాన్ని గ్రహించిన ముగ్గురు దొంగలు అక్కడికక్కడే పరారయ్యారు. అయితే, తీవ్రమైన మద్యం మత్తులో ఉన్న మిగిలిన ఇద్దరు దొంగలు కదలలేక పోలీసులకు చిక్కారు.

పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. తాము మొదట కొంత సామాగ్రిని ఎత్తుకెళ్లామని, మిగిలిన వస్తువుల కోసం తిరిగి వచ్చి మద్యం చూసి ఇక్కడే ఉండిపోయామని వారు ఒప్పుకున్నారు. దాబా యజమాని ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన మిగిలిన ముగ్గురు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు పెద్దగా శ్రమ లేకుండానే, దొంగల తాగుబోతుతనమే వారిని జైలు పాలు చేసింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *