
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి రోజువారీ ఆహారంలో టమాటా చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుందని నూతన అధ్యయనం తెలిపింది. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో భాగంగా 79 మందిపై జరిపిన పరీక్షల్లో టమాటా తిన్నవారిలో ఫ్యాటీ లివర్ తీవ్రత తగ్గినట్లు తేలింది. అయితే ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, వైద్య సలహా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిశోధన ఎలా సాగింది?..
మెటబోలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ లివర్ డిసీజ్ లేదా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న 79 మందిపై ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. పరిశోధకులు వీరిని రెండు వర్గాలుగా విభజించారు. ఒక గ్రూప్‌నకు టమాటాలు లేని ఆహారాన్ని ఇవ్వగా, మరొక గ్రూప్‌నకు ప్రతిరోజూ 200 గ్రాముల పచ్చి టమాటాలు లేదా 50 గ్రాముల టమాటా సాస్ అందించి వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. టమాటా క్రమం తప్పకుండా తీసుకున్న వారిలో కాలేయంలో కొవ్వు చేరుకునే తీవ్రత సాధారణ ఆహారం తిన్నవారికంటే గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కాలేయానికి టమాటా ఎలా రక్షణ ఇస్తుంది?:
టమాటాలో లైకోపీన్ అనే బలమైన సహజ యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలోనూ, కాలేయంలో పేరుకుపోయే నూనె, కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వండిన లేదా ఉడికించిన టమాటా రూపంలో తీసుకున్నప్పుడు ఈ లైకోపీన్ శరీరానికి మరింత త్వరగా లభిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
టమాటా ఫ్యాటీ లివర్ తీవ్రతను తగ్గించడంలో సాయపడినప్పటికీ, ఇది ఒక్కటే పూర్తిస్థాయి చికిత్స కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా టమాటాను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. కాలేయ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉన్నవారు వైద్యుల ఔషధ చికిత్సను ఆపకూడదు. రోజువారీ ఆహారంలో టమాటాలను భాగం చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించుకుని, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఈ పరిశోధన నిరూపిస్తోంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..