Headlines

కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో టీఆర్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్.. | Kalvakuntla Kavitha Explains Her Remarks on KCR in TV9 Cross Fire


బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను ఎందుకు తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది పాటు జీరో సైలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా పార్టీ నుంచి బయటకు పంపారని, దానికి గల కారణాలు తనను తొలగించినవారే చెప్పాలని స్పష్టం చేశారు. తాను విక్టిమ్‌గా సానుభూతి పొందాలని చూడటం లేదని, వాస్తవాలనే మాట్లాడుతున్నానని కవిత అన్నారు. 20 ఏళ్లపాటు పార్టీ కోసం, ఉద్యమం కోసం పని చేసిన ఒక సైనికురాలిని గాయపడిన తర్వాత వదిలేసినట్లుగా బయటకు నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా బయటపడేస్తే అది కచ్చితంగా అవమానమేనని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యక్తిగత ద్వేషం లేదు

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ సంతోష్‌లపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు, ద్వేషాలు లేవని కవిత తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలపై తాను ప్రశ్నించినప్పుడు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తనపై వ్యక్తిగత దాడులకు దిగితేనే స్పందించాల్సి వచ్చిందని వివరించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌లో వచ్చిన మార్పును చూసి ఆవేదనతోనే మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్ అని వ్యాఖ్యానించినట్లు క్లారిటీ ఇచ్చారు. తీహార్ జైలు వంటి అత్యంత కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో పార్టీ ఇలా చేయడం తీవ్ర బాధ కలిగించిందన్నారు.

జాతీయ రాజకీయాలపై స్పష్టత

తెలంగాణను కాదని బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంపై గతంలోనే తన వ్యతిరేకతను వ్యక్తం చేశానని కవిత గుర్తుచేశారు. ‘‘తెలంగాణలో ఏం చేశామని నేషనల్ పాలిటిక్స్‌కు వెళ్తాం అధ్యక్ష?’’ అని అప్పట్లోనే వ్యాఖ్యానించానని, పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉన్నప్పటికీ, బయటకు పంపిన తర్వాత తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతున్నానని వెల్లడించారు. తండ్రిని విడిచిపెట్టి కుమార్తె పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. తన బాధను సానుకూల శక్తిగా మలచుకుని సామాజిక న్యాయం కోసం పోరాడతానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *