Headlines

వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి టీమిండియా ఔట్..? | India wtc final qualification scenario galle test wash out


India WTC Final Qualification Scenario: భారత్, శ్రీలంక తొలి టెస్టుపై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. గాలే వేదికగా సాగుతున్న ఈ పోరు వరుణుడి ధాటికి రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయంతో పాయింట్ల పట్టిక సమీకరణాలు మారిపోయి, భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.

వరుణుడి దాటికి కొట్టుకుపోనున్న మ్యాచ్..?

గాలే అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు ఆరంభం నుంచి వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. మొదటి రోజు ఆట పూర్తిగా సాగకపోగా, రెండో రోజు సైతం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. వాతావరణ నివేదికల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూడో రోజు ఆట దాదాపు 81 శాతం వర్షం ముప్పుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని సమాచారం. మిగిలిన రోజుల్లోనూ వర్ష సూచన 50 శాతానికి పైగా ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లేదా రద్దు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

ఇవి కూడా చదవండి



భారత్‌కు భారీ నష్టం.. పడిపోనున్న పాయింట్లు..

ఈ మ్యాచ్ వర్షార్పణమైతే శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత సేనకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మ్యాచ్ గెలిస్తే లభించే 12 పాయింట్లకు బదులుగా, రద్దయితే కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ప్రస్తుతం 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా, మ్యాచ్ డ్రా అయితే 46.67 శాతానికి పడిపోతుంది. స్థానంలో మార్పు లేకపోయినా, పాయింట్ల శాతం గణనీయంగా తగ్గడం భవిష్యత్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ప్రతి విజయమూ అమూల్యమైన ఈ దశలో ఇలాంటి ఫలితం పిడుగుపాటు లాంటిదే.

బంగ్లాదేశ్ సంచలనం.. మరింత పెరిగిన ఒత్తిడి..

డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన అనూహ్య విజయం భారత శిబిరంలో గుబులు రేపుతోంది. కంగారూలను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన బంగ్లా పులులు తమ పాయింట్ల శాతాన్ని ఏకంగా 66.67 శాతానికి పెంచుకుని నాలుగో స్థానాన్ని పదిలం చేసుకున్నాయి. దీంతో నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు, ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు మధ్య అంతరం భారీగా పెరిగింది. పట్టికలో ఆస్ట్రేలియా 77.78 శాతం, దక్షిణాఫ్రికా 75 శాతంతో టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే..

ప్రస్తుత సమీకరణాలను గమనిస్తే భారత జట్టు ముంగిట అత్యంత కఠినమైన సవాలు నిలిచింది. గాలే టెస్ట్ ఫలితం తేలకుండా ముగిస్తే, టీమిండియా ఫైనల్ చేరడానికి రాబోయే ఎనిమిది టెస్టుల్లో కనీసం ఏడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్‌లో చిన్న పొరపాటు జరిగినా ఫైనల్ ఆశలు పూర్తిగా గల్లంతవుతాయి. అటు బంగ్లాదేశ్ దూకుడు, ఇటు వరుణుడి దెబ్బతో టీమిండియా ప్రయాణం కత్తిమీద సాములా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *