రోజూవారీ సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు కృత్రిమ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆర్థికపరమైన పెట్టుబడులు మరియు పన్నుల సలహాల కోసం కూడా చాలామంది ఇప్పుడు ఏఐ చాట్బోట్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌లో ముందుంది. కానీ, ఆర్థిక విషయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన నష్టాలు తప్పవని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని, అది మనుషుల లాగా విచక్షణతో ఆలోచించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, పన్నుల భారం తగ్గించుకోవడానికి ఏం చేయాలని ఓ యూజర్ అడిగితే.. “మోనాకోకు వెళ్లిపోండి” అని ఒక ఏఐ బోట్ సమాధానం ఇచ్చింది. సాంకేతికంగా అక్కడ పన్నులు తక్కువైనా, వాస్తవ పరిస్థితులకు ఇది ఎంత మాత్రం సరిపడదు. ఫీడెలిటి ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న రిటైల్ మదుపర్లలో 36 శాతం మంది ఏఐ సలహాల మీదే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తేలింది. మార్కెట్ ట్రెండ్స్ నిత్యం మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆదాయ వనరులు, కుటుంబ అవసరాలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. వ్యక్తిగత పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ ఇచ్చే సాధారణ సమాధానాలు మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా, ఉచిత ఏఐ సాధనాల్లో మీ బ్యాంక్ ఖాతా నెంబర్లు, పాస్వర్డ్లు, ఇతర వ్యక్తిగత ఆర్థిక వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకండి. ఈ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలను ప్రాథమికంగా తెలుసుకోవడానికి ఏఐని ఓ గైడ్‌లా వాడవచ్చు కానీ, అంతిమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడూ సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!
స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!