Headlines

Vimal Elaichi Ad Row: పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. ఇకనైనా ఆపుతారా? | Maharashtra FDA give notices to Shah Rukh Khan, Ajay Devgan and Tiger Shroff over Vimal Elaichi ad


కోట్లాది మంది అభిమానులు, అనుచరులు ఉన్న సినీ నటీనటులు పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం సరికాదన్న వాదన చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని గుట్కా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ప్రచారం చేయించడానికి భారతదేశంలోని పెద్ద స్టార్ నటులనే కాకుండా, హాలీవుడ్ స్టార్ నటులను కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి భారతీయ సూపర్‌స్టార్లు, మరికొందరు స్టార్ నటులు పాన్ మసాలా యాడ్లలో నటిస్తున్నారు. ఇప్పుడు ఆ స్టార్లకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ‘విమల్’ ప్రకటనలో నటించినందుకు గానూ బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన ‘విమల్ పాన్ మసాలా’ ఉత్పత్తికి ఇది పరోక్ష ప్రచారంగా పరిగణించబడుతుందని FDA తెలిపింది. మహారాష్ట్రలో పొగాకు, పాన్ మసాలా అమ్మకాల విక్రయాలు, ప్రచారంపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలా ఇప్పుడు ఈ ముగ్గురు స్టార్ హీరోలు కూడా FDA సంస్థ పరిశీలనలో ఉన్నారు. తమపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని హీరోలకు నోటీసులు జారీ చేశారు. గుట్కా, పొగాకు ప్రకటనలలో తమ పాత్రలపై వివరణ ఇవ్వాలని అజయ్ దేవ్‌గన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లను కోరారు. ఈ నటులు ఇప్పుడు నటిస్తున్న ‘విమల్ ఏలకుల’ ప్రకటన, ‘విమల్ పాన్ మసాలా’ బ్రాండ్‌తో సంబంధాన్ని ఏర్పరుస్తోందని, ఇది ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం పరోక్ష ప్రకటన కిందకు వస్తుందని ఎఫ్‌డిఎ (FDA) పేర్కొంది.

“సదరు ప్రకటనను పరిశీలించిన మీదట, ఆ ప్రకటన ప్రధానంగా పాన్ మసాలాతో సంబంధం ఉన్న ‘విమల్’ బ్రాండ్‌ను ప్రచారం చేస్తున్నట్లు తేలింది. జూలై 13, 2026న ఆహార భద్రతా కమిషనర్ జారీ చేసిన నిషేధ ఉత్తర్వు ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రంలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలు ఒక సంవత్సరం పాటు నిషేధించబడ్డాయి. మహారాష్ట్రలో 2012 నుంచి పొగాకు లేదా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం ఉంది. కమిషనర్ తుకారాం ముండే నాయకత్వంలో మహారాష్ట్ర ఎఫ్‌డిఎ పొగాకు అమ్మకాలు, ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక విమల్ పాన్ మసాలా వంటి పరోక్ష ప్రకటనలకు సంబంధించి ఎఫ్‌డిఎ మొదటిసారిగా ఈ కేసును విచారిస్తోంది. అజయ్ దేవ్‌గన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌ ఈ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *