Headlines

పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదుగా.. | Bengaluru Techie Rejects Rs 2 Lakh Salary Groom Over Quit Job After Marriage Condition


నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. అయితే నేటికీ కొందరు పురుషుల ఆలోచనా ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించే ఘటన ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. నెలకు రూ.2 లక్షల జీతం ఉన్న వరుడు పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలి అని షరతు పెట్టడంతో బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఆ సంబంధాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించింది.

అసలేం జరిగింది?

బెంగళూరుకు చెందిన నందిని అనే యువతి ఐటీ రంగంలో పనిచేస్తూ నెలకు రూ.90,000 వేతనం సంపాదిస్తోంది. కొన్ని నెలల క్రితం ఆమె కుటుంబ సభ్యులు ఒక వివాహ సంబంధాన్ని తెచ్చి, పెళ్లి చేసుకోవాలని భావోద్వేగంగా ఒత్తిడి తెచ్చారు. ఆ సంబంధంలో వరుడు నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే పెళ్లికి ముందే అతను విచిత్రమైన షరతులు పెట్టాడు. కుటుంబ ఖర్చుల్లో సగం భరించాలని, లేనిపక్షంలో ఉద్యోగం పూర్తిగా మానేసి ఇంట్లోనే గృహిణిగా ఉండిపోవాలని హుకుం జారీ చేశాడు.

నెటిజన్లను ఆలోచింపజేసిన యువతి ప్రశ్నలు

ఈ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన నందిని, తన సోషల్ మీడియా పోస్ట్‌లో వరుడి తీరుపై సూటి ప్రశ్నలు సంధించింది. ‘‘మీపై ఆధారపడే భార్య కావాలనుకుంటే, ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడే మహిళలను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా బతుకుతున్న అమ్మాయిలను జాబ్ మానేయమని ఎందుకు ఒత్తిడి చేస్తారు?’’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మద్దతు

ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో రెండు లక్షలకు పైగా వ్యూస్ రావడమే కాకుండా నెటిజన్లు ఆ యువకుడి పాతకాలపు మనస్తత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే భార్య తన చెప్పుచేతల్లో ఉండదనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆ యువకుడికి ఉన్నట్లుంది. మీరు ఆ పెళ్లిని తిరస్కరించి చాలా మంచి పని చేశారు’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘నేటి కాలంలో ఇద్దరూ సంపాదిస్తేనే కుటుంబాలు సజావుగా సాగుతాయి. అలాంటిది ఉద్యోగం మానేయాలనడం మూర్ఖత్వం’’ అని మరికొందరు ఆమె తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఎంత పెద్ద జీతం ఉన్నా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదని నిరూపించిన ఈ బెంగళూరు యువతి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *