Headlines

తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ.. రిటైర్మెంట్ తర్వాత తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్! | Test Debut Double Centurion Who Faced Financial Struggles After Cricket Retirement know about Matthew Sinclair


క్రికెట్‌లో అద్భుతమైన ఆరంభం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఉద్యోగం కోసం తలుపులు తట్టాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మాథ్యూ సింక్లెయిర్ జీవితం ఈ రెండు భిన్నమైన దశలకు నిదర్శనంగా నిలిచింది. టెస్టు అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన ఈ బ్యాటర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్దికాలానికే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు.

డెబ్యూలోనే డబుల్ సెంచరీ

1999లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సింక్లెయిర్ 214 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై మరో టెస్టులో 204 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున 33 టెస్టులు, 54 వన్డేలు ఆడిన ఆయన.. దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతమైన రికార్డు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 36 సెంచరీలు, 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ తర్వాత ఆ అనుభవం ఉద్యోగ మార్కెట్‌లో పెద్దగా ఉపయోగపడలేదు.

2013లో రిటైర్మెంట్.. ఆ తర్వాత అసలు కష్టం

2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సింక్లెయిర్‌కు ఊహించని సమస్య ఎదురైంది. ఆయనకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయకపోవడం, వ్యాపార రంగంలో అనుభవం లేకపోవడం ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న సమయంలో పెద్ద అడ్డంకిగా మారాయి. క్రికెట్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్నా.. కంపెనీలకు కావాల్సింది డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం కావడంతో వరుసగా తిరస్కరణలు ఎదురయ్యాయి.

ప్రభుత్వ నిరుద్యోగ భృతికి దరఖాస్తు

పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. తన ఇద్దరు చిన్న పిల్లలను పోషించేందుకు సింక్లెయిర్ న్యూజిలాండ్ ప్రభుత్వ నిరుద్యోగ భృతి కోసం కూడా నమోదు చేసుకున్నారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌నని చెప్పుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం తన జీవితంలో అత్యంత కష్టమైన అనుభవాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు వేలాది మంది అభిమానించిన క్రికెటర్.. కుటుంబాన్ని నడిపించేందుకు ఉద్యోగం కోసం వెతకాల్సి వచ్చింది.

ఉద్యోగం కోసం..

ఒక దశలో మాజీ న్యూజిలాండ్ ఓపెనర్ మార్క్ రిచర్డ్‌సన్ నిర్వహించిన రేడియో కార్యక్రమానికి ఫోన్ చేసిన సింక్లెయిర్.. “నా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేశాను” అంటూ తనను పరిచయం చేసుకుని, ఏదైనా ఉద్యోగం దొరికేలా సహాయం చేయాలని కోరారు. కానీ ఆ ప్రయత్నం వెంటనే ఫలించలేదు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఫోన్ రాకపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది.

దొరికిన ఉద్యోగం కూడా పోయింది

తర్వాత ఒక ఫిషింగ్ అండ్ హంటింగ్ వ్యాపారంలో ఉద్యోగం సంపాదించారు. అయితే సుమారు తొమ్మిది నెలలకే ఆ సంస్థలో ఉద్యోగం కోల్పోయారు. దీంతో మళ్లీ నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ కాలంలో తీవ్ర నిరాశతో పోరాడిన ఆయన.. స్నేహితులు, మానసిక నిపుణులు, మాజీ క్రికెటర్లతో మాట్లాడటం ద్వారా పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.

రియల్ ఎస్టేట్‌లో కొత్త జీవితం

చివరకు హాక్స్ బే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. హార్కోర్ట్స్ సంస్థతో ఏజెంట్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయితే ఇది జీతంతో కూడిన ఉద్యోగం కాదు.. అమ్మకాలు జరిగితేనే కమిషన్ వచ్చే విధానం. ఉదయం నుంచి ఇళ్ల కోసం తిరగడం, డోర్ నాకింగ్, సోషల్ మీడియాలో ప్రకటనలు, కస్టమర్లకు లేఖలు పంపడం.. ఇలా రోజంతా పని చేయాల్సి వచ్చేది. ఆయన తొలి రియల్ ఎస్టేట్ విక్రయం కేవలం 17 గంటల్లోనే పూర్తవడం కొంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

కుటుంబంపైనా ఆర్థిక భారం

ఈ ఆర్థిక సంక్షోభం ఆయన వైవాహిక జీవితంపైనా ప్రభావం చూపింది. భార్య పార్ట్‌టైమ్‌గా బారిస్టాగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. పిల్లలను చూసుకోవడం, ఆర్థిక ఒత్తిడి, సింక్లెయిర్ ఎదుర్కొంటున్న నిరాశ.. ఇవన్నీ కుటుంబ జీవితాన్ని కష్టతరం చేశాయి. అయినప్పటికీ ఇద్దరూ కలిసి పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *