Headlines

26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్! పోలీసులు అరెస్ట్ చేస్తే.. తన కేసు కూడా వాదించి గెలిచాడు! | Fake Lawyer Wins 26 Cases in Kenya: Who Is Brian Mwenda and How Was His Identity Exposed?


కోర్టులో న్యాయవాదిగా వాదిస్తూ ఏకంగా 26 కేసులు గెలిచిన నకిలీ లాయర్ వ్యవహారం కెన్యాలో సంచలనంగా మారింది. తనను తాను కెన్యా హైకోర్టు న్యాయవాదిగా పరిచయం చేసుకున్న బ్రియాన్ మ్వెండా అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్లు, అప్పీల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట కూడా అతను కేసులు వాదించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

లా చదవకుండానే కోర్టులో వాదనలు

బ్రియాన్ మ్వెండా చాలా కాలం పాటు తాను అర్హత కలిగిన న్యాయవాదిననే నమ్మకాన్ని కలిగించగలిగాడు. ఆశ్చర్యకరంగా అతని వాదనల సామర్థ్యంపై న్యాయమూర్తులు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలోనే అతను వివిధ కోర్టుల్లో కేసులు వాదిస్తూ 26 కేసుల్లో విజయం సాధించినట్లు సమాచారం. అయితే అతని అసలు గుర్తింపు బయటపడటంతో ఈ వ్యవహారం కెన్యా న్యాయవ్యవస్థలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన 2023లో చోటు చేసుకుంది.

లా సొసైటీ ఆఫ్ కెన్యా (LSK) వివరాల ప్రకారం.. మ్వెండా మరో వ్యక్తికి చెందిన న్యాయవాది గుర్తింపును ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు న్యాయవాది పేరు బ్రియాన్ మ్వెండా న్ట్విగా కాగా, మ్వెండా తన పేరుకు దగ్గరగా ఉన్న ఈ గుర్తింపును ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. అసలు న్యాయవాది 2023లో తన LSK పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సమస్యను గుర్తించారు. తన ఖాతాలోని ఈమెయిల్ చిరునామా తనది కాదని తెలుసుకున్న తర్వాత లా సొసైటీకి ఫిర్యాదు చేశారు.

ఫొటో మార్చి.. ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు

దర్యాప్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మ్వెండా లా సొసైటీకి సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించి, తన ఫొటోను అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రొఫైల్‌లోని కార్యస్థల వివరాలను మార్చి, ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి, దానికి సంబంధించిన చెల్లింపులు కూడా చేసినట్లు LSK వెల్లడించింది. అయితే అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో ఆ దరఖాస్తు పూర్తిగా ప్రాసెస్ కాలేదు.

లా సొసైటీకి ఫిర్యాదులు.. అరెస్ట్

మ్వెండాపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో లా సొసైటీ ఆఫ్ కెన్యా నైరోబీ బ్రాంచ్‌కు చెందిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్ రంగంలోకి దిగింది. దర్యాప్తు అనంతరం అతను అధికారికంగా LSKలో నమోదైన న్యాయవాది కాదని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కెన్యాలో న్యాయవాదుల గుర్తింపు, ఆన్‌లైన్ పోర్టల్ భద్రత, న్యాయ వృత్తిలో అర్హతల ధృవీకరణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

26 కేసులు గెలిచాడు..

ఒక వ్యక్తి న్యాయవాదిగా అధికారిక అర్హత లేకుండానే కోర్టుల్లో వాదించి ఇన్ని కేసుల్లో విజయం సాధించాడన్న విషయం ఈ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే ఆ 26 కేసుల తీర్పులపై తదుపరి చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా తన కేసును కూడా తనే వాదించి, అది కూడా గెలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *