Headlines

బంగారం వేట కోసం ఆఫ్రికా గ్రామానికి పోటెత్తిన జనం .. !  | Gold Rush In Africa Village After Farmer’s Find Goes Viral


ఆఫ్రికాలోని కెన్యా దేశం, వెస్ట్ పోకోట్ కౌంటీ పరిధిలోని మారుమూల గ్రామం చెపోరోర్ లో  వింత పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు చుక్కలనంటుతున్న ఈ రోజుల్లో.. ఎవరికైనా ఉచితంగా బంగారం దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే అక్కడ జరుగుతోంది.

ఈ గ్రామానికి చెందిన పశువుల కాపరి మనాస్సే లోమచార్ నది ఒడ్డున కొంతమంది మహిళలు మట్టిలో బంగారం కోసం జల్లెడ పడుతుండటం గమనించాడు. అతను కూడా వాళ్లతో కలిసి వెతికాడు. ఆశ్చర్యకరంగా అతనికి 3 గ్రాముల బంగారు నగ్గెట్ అంటే బంగారు ముక్క దొరికింది! దాన్ని అమ్మి అతను సుమారు 36 కోట్ల కెన్యా షిల్లింగ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 26,615 సంపాదించాడు.

వైరల్ అయిన వార్త.. పోటెత్తిన జనాలు!

ఒక సాధారణ రైతుకు ఈజీగా బంగారం దొరకడంతో ఆ వార్త దావానంలా వ్యాపించింది. ఇంకే ముంది, చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా పక్కనే ఉన్న ఉగాండా దేశం నుంచి కూడా జనం ఆ గ్రామానికి క్యూ కట్టారు. ఒక దశలో ఆ చిన్న గ్రామానికి ఏకంగా 10 వేల మందికి పైగా జనాలు వచ్చి పడ్డారు!

ఆ ప్రాంతంలో చిన్నపాటి బంగారు రేణువులు దొరకడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి కాస్త గట్టిగానే బంగారు నగ్గెట్ దొరికిందన్న వార్త వైరల్ కావడంతో జనాలు ఎగబడ్డారు. కొందరైతే తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ అదృష్టం ఒక పెద్ద అవకాశంగా మారుతుందని నమ్మి వచ్చారు.

వ్యాపారాలు షురూ.. కానీ సమస్యలు కూడా!

విపరీతమైన జనసందోహం వల్ల ఆ చిన్న గ్రామం రూపురేఖలే మారిపోయాయి. జనాలు భారీగా రావడంతో అక్కడ ఏకంగా 200లకు పైగా కొత్త దుకాణాలు పుట్టుకొచ్చాయి. ఆహారం, తాగునీరు అమ్ముకుంటూ కొందరు ఆ గోల్డ్ రష్‌లో మంచిగా వ్యాపారం చేసుకుంటున్నారు.

అయితే, ఇంత పెద్ద సంఖ్యలో జనాలు ఒక్కసారిగా వచ్చిపడటంతో ఆ గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారుతోంది. ఆ గ్రామం మౌలిక వసతులు దెబ్బతింటున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అక్కడ భారీగా బంగారం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా,  ‘గోల్డ్ క్రేజ్’ మాత్రం సోషల్ మీడియాలోనూ ఆ ప్రాంతంలోనూ హాట్ టాపిక్‌గా మారింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *