Headlines

జిమ్ బయట గన్‌ఫైర్.. 20 రౌండ్ల కాల్పులు.. స్టార్ సింగర్ అంకిత్ స్పాట్ డెడ్! | Haryana: Haryanvi singer and YouTuber Ankit Baliyan shot 20 times until dead outside gym


ప్రముఖ హర్యానా గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతంలో బుధవారం (ఆగస్టు 26) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల అంకిత్ బలియాన్ జిమ్‌లో వ్యాయామం ముగించుకుని బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు ఆయనపై సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాల్పుల్లో అంకిత్ తలకు బుల్లెట్ గాయం కావడంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జిమ్‌కు కేవలం 20 నుంచి 25 మీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. నిందితులు ఎవరు, ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అంకిత్ బలియాన్ హత్యకు తామే బాధ్యులమంటూ గోగి గ్యాంగ్ ప్రకటించినట్లు సమాచారం. బలియాన్ తమ ప్రత్యర్థులతో సంబంధాలు ఉన్నాయని, తమ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ఘటనపై పాట కూడా రాశాడని ఆ ముఠా ఆరోపించింది. గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న భోలు షాపురియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బెదిరింపు సందేశం కూడా వెలువడింది. అయితే ఈ ప్రకటనల నిజానిజాలను పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

మరోవైపు అంకిత్ బలియాన్ హత్యపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఢిల్లీ-ముజఫర్‌నగర్ రహదారిని దిగ్బంధించారు. నిందితులు పట్టుబడే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు.

‘భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్’ పాటతో బలియాన్ విస్తృత గుర్తింపు పొందారు. తుపాకీ సంస్కృతి, స్థానిక రాజకీయాలు, గ్రామీణ జీవనశైలి వంటి అంశాలతో కూడిన హర్యానా పాప్ పాటలతో పాటు యూట్యూబ్ కంటెంట్, పాడ్‌కాస్ట్‌లు, వ్లాగింగ్ ద్వారా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. మసూమ్ శర్మ, రాజు పంజాబీ, ఆశు ట్వింకిల్ వంటి కళాకారులతో కలిసి పనిచేశారు.

ప్రస్తుతం పోలీసులు పాత కక్షలు, స్థానిక రాజకీయ విభేదాలు, రాబోయే పంచాయతీ ఎన్నికలతో సంబంధం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది. ఈ హత్య వెనుక అసలు కారణం, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *