Headlines

Moral Story: మనసుకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? చిన్న కథలో గొప్ప జీవిత రహస్యం | The Secret to a Peaceful Mind: One Simple Story That Can Change the Way You See Life


పర్వతాల మధ్యలో ఉన్న ఓ అందమైన చిన్న గ్రామంలో మార్కో అనే 24 ఏళ్ల యువకుడు ఉండేవాడు. మార్కోకు అన్నీ ఉన్నా… ఒక్కటి మాత్రం లేదు — మనశ్శాంతి. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. ‘గతంలో నేను అలా ఎందుకు చేశాను? రేపు ఏం జరుగుతుంది? నా జీవితం ఎలా మారుతుంది?’ ఇలా గతం గురించి బాధపడుతూ… భవిష్యత్తు గురించి భయపడుతూ… అతని రోజులు గడిచిపోయేవి. ఆలోచనలు అతని మనసులో తుఫానులా తిరుగుతుండేవి. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పగలు ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోయేవాడు. చివరకు నవ్వడం కూడా మర్చిపోయాడు.

ఒకరోజు మార్కోకు ఓ విషయం తెలిసింది. పర్వతాల మధ్య ఉన్న ఓ దూరపు గ్రామంలో ఓ వృద్ధ జ్ఞాని నివసిస్తున్నాడట. ఒకప్పుడు ఆయన నగరంలో ప్రముఖ మనస్తత్వ నిపుణుడిగా పనిచేసేవారట. ఎన్నోమంది తమ సమస్యలతో ఆయనను కలిసేవారు. వారి మనసులోని అలజడిని తొలగించి, ప్రశాంతంగా జీవించడం ఎలాగో ఆయన నేర్పించేవారు. వయసు పెరిగిన తర్వాత నగర జీవితాన్ని వదిలి ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆ గ్రామానికి వెళ్లి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ విషయం విన్న మార్కోలో ఆశ కలిగింది. ‘బహుశా… నా మనసుకు శాంతిని ఇచ్చే మార్గం ఆయన చెప్పగలరేమో!’ అని అనుకున్నాడు. మరుసటి రోజే ఆ వృద్ధుడిని కలవడానికి బయలుదేరాడు.

కొన్ని రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మార్కో ఆ గ్రామానికి చేరుకున్నాడు. పచ్చని చెట్ల మధ్య ఓ చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి వరండాలో ఓ వృద్ధుడు కళ్లుమూసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. మార్కో ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ‘తాతగారూ… నా మనసు చాలా చంచలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగడం లేదు. నాకు ప్రశాంతత కావాలి. మీరు నాకు సహాయం చేయగలరా?’ అని అడిగాడు. వృద్ధుడు నెమ్మదిగా కళ్లుతెరిచి చిరునవ్వు నవ్వాడు. ‘శాంతి కావాలా? తప్పకుండా. కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి’ అంటూ ఇంట్లోకి వెళ్లి ఓ గ్లాసు తీసుకొచ్చాడు. ఆ గ్లాసును అంచుల వరకు నీటితో నింపాడు. ‘ఇదిగో ఈ గ్లాసును తీసుకో. గ్రామం చివరి వరకు వెళ్లి తిరిగి నా దగ్గరకు రా.. కానీ ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు’ అని అన్నాడు. మార్కోకు ఆ పని చాలా వింతగా అనిపించింది. అయినా వృద్ధుడి మాటను పాటించాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి



గ్లాసును జాగ్రత్తగా చేతిలో పట్టుకుని నడవడం ప్రారంభించాడు. గ్రామంలోని దారి చాలా రద్దీగా ఉంది. ఎవరో పరుగులు తీస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. దుకాణదారులు కస్టమర్లను పిలుస్తున్నారు. కుక్కలు మొరుగుతున్నాయి. ఎక్కడ చూసినా శబ్దమే. కానీ మార్కో మాత్రం వాటిని ఏమీ పట్టించుకోలేదు. అతని కళ్లంతా గ్లాసుపైనే ఉన్నాయి. ఒక్క అడుగు… మరో అడుగు… చాలా జాగ్రత్తగా నడుస్తూ గ్రామం చివరికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వృద్ధుడి దగ్గరకు వచ్చాడు. గ్లాసును చూపిస్తూ ఆనందంగా అన్నాడు ‘తాతగారూ! నేను చేసేశాను. ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు’.

వృద్ధుడు చిరునవ్వు నవ్వి అడిగాడు ‘చాలా మంచిది. కానీ నువ్వు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పిల్లలు ఆడుకోవడం చూశావా?’ మార్కో తల ఊపాడు.. ‘లేదు’. ‘మరి అక్కడ మొరుగుతున్న కుక్కలు కనిపించాయా?’. లేదు అన్నాడు. దుకాణాల దగ్గర జరుగుతున్న సందడి చూశావా? ‘లేదు తాతగారూ. నేను గ్లాసుపైనే దృష్టి పెట్టాను’ అన్నాడు. అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో మార్కో వైపు చూశాడు. ‘అదే నీకు కావాల్సిన సమాధానం’ మార్కో ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. వృద్ధుడు నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. ‘నీ మనసు గతంలో ఉన్నప్పుడు… పశ్చాత్తాపం నిన్ను వెంటాడుతుంది. నీ మనసు భవిష్యత్తులో ఉన్నప్పుడు… భయం నిన్ను వెంటాడుతుంది. కానీ నీ మనసు ఈ క్షణంలో ఉన్నప్పుడు… గతానికి, భవిష్యత్తుకు చోటుండదు. నువ్వు ఈరోజు గ్లాసులోని నీటిపై మాత్రమే దృష్టి పెట్టావు. అందుకే నీ చుట్టూ ఎంత శబ్దం ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉంది. నువ్వు గతం గురించి ఆలోచించలేదు. భవిష్యత్తు గురించి భయపడలేదు. నువ్వు కేవలం ఈ క్షణంలో జీవించావు.’ ఆ మాటలు విన్న మార్కో మౌనంగా నిలబడ్డాడు. ఇన్నాళ్లూ తాను వెతుకుతున్న శాంతి ఎక్కడో బయట ఉందని అనుకున్నాడు. కానీ అది తనలోనే ఉందని ఇప్పుడు అర్థమైంది.

అతను వృద్ధుడికి నమస్కరిస్తూ అన్నాడు.. ‘తాతగారూ… ఇప్పుడు నాకు అర్థమైంది. నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నేను నా మనసును ఈ క్షణంలో ఉంచుకోవాలి. అప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది.’ వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశంలో చివరి సూర్యకిరణాలు పర్వతాలను తాకుతున్నాయి. పక్షులు తమ గూళ్లకు తిరిగి వెళ్తున్నాయి. మార్కో తన గ్రామానికి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కానీ ఈసారి అతను వచ్చినప్పుడు ఉన్న మార్కో కాదు. అతని సమస్యలు మారలేదు. అతని జీవితం కూడా వెంటనే మారలేదు. కానీ అతని ఆలోచించే విధానం మారిపోయింది. అతను గతాన్ని మార్చలేనని తెలుసుకున్నాడు. భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేనని అర్థం చేసుకున్నాడు. కానీ తన చేతిలో ఉన్నది ఒక్కటే… ఈ క్షణం. అప్పటి నుంచి మార్కో తన మనసు గతంలోకి వెళ్లినప్పుడల్లా, భవిష్యత్తు గురించి భయపడినప్పుడల్లా… ఆ నీటితో నిండిన గ్లాసును గుర్తు చేసుకునేవాడు. అలా నెమ్మదిగా అతని జీవితంలోకి శాంతి వచ్చింది.

నీతి

ఈ కథ మనకు చెప్పే ప్రధాన నీతి మనశ్శాంతి బయట ఎక్కడో దొరికేది కాదు.. మనం జీవించే విధానంలోనే ఉంటుంది అనే విషయం. మార్కో సమస్య అతని చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు. అతని సమస్య అతని మనసు ఎప్పుడూ గతం, భవిష్యత్తు మధ్య తిరుగుతూ ఉండటం. గతంలో జరిగిన తప్పులను పదేపదే గుర్తు చేసుకుంటే మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ జరిగినది మార్చలేం. అలాగే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించుకుంటూ భయపడితే మన ప్రశాంతతను మనమే కోల్పోతాం. వృద్ధుడు మార్కోకు గ్లాసు నీటిని ఇచ్చినప్పుడు, అతని దృష్టి మొత్తం ఆ గ్లాసుపైనే ఉంది. చుట్టూ ఎంత రద్దీ ఉన్నా, ఎంత శబ్దం ఉన్నా అతనికి ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అతని పూర్తి దృష్టి ప్రస్తుత క్షణంపైనే ఉంది. అదే విధంగా మన జీవితంలో కూడా ఒకేసారి జరిగే ప్రతి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మనసు అలసిపోతుంది. చేయాల్సిన పని ఏదైతే ఉందో దానిపైనే దృష్టి పెట్టడం నేర్చుకుంటే మనలో ఒత్తిడి తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *