Headlines

దేశ అభివృద్ధిలో విద్య, విజ్ఞానం కీలక పాత్ర.. పదేళ్లలో ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులు.. | India’s Higher Education Sector and knowledge ecosystem sees a a Decade of Growth, Access, and Inclusion


న్యూఢిల్లీ: విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. గత దశాబ్దంలో భారత ఉన్నత విద్యా రంగం గణనీయమైన విస్తరణను నమోదు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అఖిల భారత ఉన్నత విద్యా సర్వే (AISHE) గణాంకాలు దేశంలో ఉన్నత విద్యకు పెరుగుతున్న ప్రాప్యత, మహిళల భాగస్వామ్యం, సామాజిక సమ్మిళితత్వం, STEM విద్య, మౌలిక సదుపాయాల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి.

పెరిగిన విశ్వవిద్యాలయాలు.. విస్తరించిన విద్యా వ్యవస్థ

2014-15 నుంచి 2023-24 మధ్య దేశంలోని విశ్వవిద్యాలయాల సంఖ్య భారీగా పెరిగింది. 2014-15లో 760 విశ్వవిద్యాలయాలు ఉండగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 1,289కి చేరింది. అంటే దాదాపు 69.6 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో కళాశాలల సంఖ్య 38,498 నుంచి 48,246కి పెరిగింది. ఇది 25.3 శాతం వృద్ధి. స్వతంత్ర విద్యాసంస్థల సంఖ్య కూడా 12,276 నుంచి 15,221కి పెరిగి సుమారు 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ విస్తరణ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా అవకాశాలు పెరగడానికి, మరింత మంది విద్యార్థులకు విద్య అందుబాటులోకి రావడానికి దోహదపడింది.

4.50 కోట్లకు చేరిన విద్యార్థుల నమోదు

ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య కూడా గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. 2014-15లో 3.42 కోట్ల మంది ఉన్నత విద్యలో నమోదు కాగా.. 2023-24 నాటికి ఈ సంఖ్య 4.50 కోట్లకు చేరింది. అంటే సుమారు 31.5 శాతం వృద్ధి. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (GER) కూడా 2014-15లో 23.7 శాతం నుంచి 2022–23లో 29.5 శాతానికి, 2023–24లో 30 శాతానికి చేరింది. 2035 నాటికి GERను 50 శాతానికి పెంచాలన్న జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యానికి ఇది కీలక పురోగతిగా భావిస్తున్నారు.

పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో భారీ వృద్ధి

స్థాయిల వారీగా చూస్తే కొన్ని కోర్సుల్లో నమోదు విపరీతంగా పెరిగింది.

పీహెచ్‌డీ: 1.17 లక్షల నుంచి 3.43 లక్షలకు పెరిగిన విద్యార్థులు అంటే 192.89% వృద్ధి

పోస్ట్ గ్రాడ్యుయేట్: 38.53 లక్షల నుంచి 57.85 లక్షలకు – 50.15% వృద్ధి

అండర్ గ్రాడ్యుయేట్: 2.71 కోట్ల నుంచి 3.45 కోట్లకు – 27.27% వృద్ధి

డిప్లొమా: 25.08 లక్షల నుంచి 33.15 లక్షలకు – 32.22% వృద్ధి

సర్టిఫికేట్: 1.70 లక్షల నుంచి 2.08 లక్షలకు – 22.55% వృద్ధి

ఇంటిగ్రేటెడ్ కోర్సులు: 1.41 లక్షల నుంచి 5.69 లక్షలకు – 301.36% వృద్ధి

ముఖ్యంగా పరిశోధన, ఉన్నత విద్య వైపు విద్యార్థుల ఆసక్తి పెరుగుతున్నదానికి పీహెచ్‌డీ నమోదు పెరుగుదల ఒక ముఖ్య సూచికగా నిలుస్తోంది.

మహిళల విద్యలో కీలక ముందడుగు

ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. 2014-15లో 1.57 కోట్లుగా ఉన్న మహిళా విద్యార్థుల నమోదు.. 2023–24 నాటికి 2.24 కోట్లకు చేరింది. అంటే 42.2 శాతం వృద్ధి. మహిళల GER 2014–15లో 22.9 శాతం ఉండగా.. 2023-24 నాటికి 31.2 శాతానికి పెరిగింది. వరుసగా ఏడో సంవత్సరం మహిళల GER పురుషుల GER కంటే ఎక్కువగా నమోదైంది. 2023-24లో పురుషుల GER 28.9 శాతంగా ఉంది. 2023-24లో మహిళల నమోదు పీహెచ్‌డీలో 1.71 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 32.53 లక్షలు, అండర్ గ్రాడ్యుయేషన్‌లో 1.71 కోట్లు, డిప్లొమాలో 13.27 లక్షలు, సర్టిఫికేట్ కోర్సుల్లో 1.10 లక్షలు, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 2.73 లక్షలుగా నమోదైంది.

లింగ సమానత్వంలో మెరుగుదల

ఉన్నత విద్యలో లింగ సమానత్వ సూచిక (GPI) కూడా గణనీయంగా మెరుగుపడింది. 2014–15లో 0.92గా ఉన్న GPI.. 2023–24 నాటికి 1.08కి చేరింది. అంటే ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే సమాన స్థాయిని దాటి మహిళలకు అనుకూలంగా మారినట్లు ఈ సూచిక వెల్లడిస్తోంది. ఎస్సీ వర్గంలో GPI 0.91 నుంచి 1.11కి, ఎస్టీ వర్గంలో 0.81 నుంచి 1.08కి పెరిగింది.

పెరుగుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల భాగస్వామ్యం

సామాజికంగా వెనుకబడిన వర్గాల ఉన్నత విద్యలో భాగస్వామ్యం కూడా పెరిగింది. మొత్తం నమోదులో ఎస్సీ విద్యార్థుల వాటా 2014-15లో 13.44 శాతం ఉండగా.. 2023–24లో 15.5 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థుల వాటా 4.8 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది. ఓబీసీ విద్యార్థుల వాటా మాత్రం 32.8 శాతం నుంచి 40.1 శాతానికి పెరిగింది. అన్ని సామాజిక వర్గాల్లో ఇదే అత్యధిక పెరుగుదల. ఎస్సీ విద్యార్థుల GER 18.9 శాతం నుంచి 27.8 శాతానికి, ఎస్టీ విద్యార్థుల GER 13.5 శాతం నుంచి 22.8 శాతానికి పెరిగింది.

ఉన్నత విద్య పూర్తి చేస్తున్న వారి సంఖ్య పెరుగుదల

ఉన్నత విద్యను పూర్తిచేసి బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. 2014-15లో 88.28 లక్షల మంది ఉన్నత విద్యను పూర్తి చేయగా.. 2023–24 నాటికి ఈ సంఖ్య 1.09 కోట్లకు పైగా చేరింది. ఇది 24.06 శాతం వృద్ధి. పెరుగుతున్న నమోదు, విద్యార్థుల కొనసాగింపు, మెరుగైన ప్రోగ్రామ్ పూర్తి రేట్లు, సంస్థాగత సామర్థ్యం పెరగడం ఈ వృద్ధికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

STEM విద్యలోనూ వృద్ధి

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటే STEM కోర్సులపై విద్యార్థుల ఆసక్తి కూడా పెరిగింది. 2014-15లో STEMలో మొత్తం నమోదు 91.5 లక్షలు కాగా.. 2023-24 నాటికి 1.02 కోట్లకు చేరింది. అంటే సుమారు 11.5 శాతం వృద్ధి. డిజిటల్ టెక్నాలజీ, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు STEM విద్యకు మరింత ప్రాధాన్యతను తీసుకొస్తున్నాయి.

భారత్ వైపు విదేశీ విద్యార్థుల చూపు

భారత ఉన్నత విద్యకు అంతర్జాతీయ ఆకర్షణ కూడా పెరుగుతోంది. 2014-15లో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో 42,293 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 58,134కి చేరింది. ఇది సుమారు 37.5 శాతం వృద్ధి. అంతర్జాతీయ విద్యా సహకారాలు, భారతీయ విద్యాసంస్థలకు పెరుగుతున్న గుర్తింపు, విద్యా అవకాశాల విస్తరణ దీనికి దోహదపడుతున్నాయి.

పెరిగిన అధ్యాపకుల సంఖ్య

ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల సంఖ్య కూడా పెరిగింది. 2014-15లో 14.73 లక్షల మంది ఉపాధ్యాయులు ఉండగా.. 2023-24లో ఈ సంఖ్య 17.32 లక్షలకు చేరింది. అంటే దాదాపు 2.59 లక్షల మంది అదనంగా చేరారు. మొత్తం వృద్ధి సుమారు 17.6 శాతం. మహిళా అధ్యాపకుల సంఖ్య ఈ కాలంలో 36.7 శాతం పెరిగింది. మొత్తం అధ్యాపకుల్లో మహిళల వాటా 2022-23లో 44.3 శాతం ఉండగా.. 2023–24లో 44.9 శాతానికి పెరిగింది.

మౌలిక సదుపాయాల్లోనూ పురోగతి

ఉన్నత విద్యాసంస్థల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాయి. 2023-24లో 94 శాతం విశ్వవిద్యాలయాలు, 95 శాతం కళాశాలలు, 91 శాతం స్వతంత్ర సంస్థల్లో ఆట స్థలాలు ఉన్నాయి. గ్రంథాలయాల విషయానికి వస్తే.. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర సంస్థల్లో 98 శాతం చొప్పున గ్రంథాలయ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రయోగశాలలు 89 శాతం విశ్వవిద్యాలయాలు, 85 శాతం కళాశాలలు, 94 శాతం స్వతంత్ర సంస్థల్లో ఉన్నాయి. అదనంగా ఆరోగ్య కేంద్రాలు, కంప్యూటర్ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సదుపాయాలు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు వంటి సౌకర్యాలు కూడా అనేక సంస్థల్లో అందుబాటులోకి వచ్చాయి.

NEP 2020 లక్ష్యాల వైపు భారత్

మొత్తంగా చూస్తే.. గత దశాబ్దంలో భారత ఉన్నత విద్యా రంగం పరిమాణం మాత్రమే కాకుండా దాని సామాజిక పరిధి కూడా విస్తరించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల సంఖ్య పెరగడం నుంచి విద్యార్థుల నమోదు, మహిళల భాగస్వామ్యం, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ వర్గాల ప్రాతినిధ్యం, STEM విద్య, పరిశోధన, అధ్యాపకుల సంఖ్య, మౌలిక సదుపాయాల వరకు పలు అంశాల్లో పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల GER పురుషుల కంటే అధికంగా నమోదవడం, GPI 1.08కి చేరడం, పీహెచ్‌డీ నమోదు దాదాపు మూడు రెట్లు పెరగడం వంటి పరిణామాలు భారత ఉన్నత విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.

అయితే 2035 నాటికి ఉన్నత విద్య GERను 50 శాతానికి తీసుకెళ్లడం, విద్యా నాణ్యతను మరింత పెంచడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం వంటి సవాళ్లు ఇంకా ముందున్నాయి. జ్ఞానం, పరిశోధన, నైపుణ్యాలు, సాంకేతికతల ఆధారంగా భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషించనుంది. గత దశాబ్దపు విస్తరణకు కొనసాగింపుగా.. మరింత సమ్మిళిత, నాణ్యమైన, పరిశోధన ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడమే తదుపరి దశ లక్ష్యంగా మారుతోంది.

మరిన్ని కెరీర్ , ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *