
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ కనిపించింది. దాని రెక్కకు గాయమై, కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇది అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడూ జిల్లాలో కనిపించని ఈ ప్రత్యేక జీవి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇది దేనికి సంకేతం? శుభానికా? అశుభానికా? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఆ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టైటా గుడ్లగూబ ప్రత్యేకతలు..
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రివేళల్లో కనిపించే గుడ్లగూబలను చాలామంది సాధారణ పక్షులుగానే భావిస్తారు. అయితే వ్యవసాయానికి గుడ్లగూబలు చేసే మేలు ఎంతో కీలకం. ముఖ్యంగా పొలాలు, పంట భూముల సమీపంలో కనిపించే టైటా జాతి గుడ్లగూబలు ఎలుకలు, చిన్న చిన్న క్షీరదాలను వేటాడుతూ రైతులకు సహజంగా ఉపయోగపడతాయి. టైటా గుడ్లగూబలు ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. వాటి చూపు, వినికిడి శక్తి చాలా పదునుగా ఉండటంతో చీకటిలోనూ ఆహారాన్ని గుర్తించగలవు. ముఖ్యంగా పొలాల్లో పంటలకు నష్టం కలిగించే ఎలుకలు, ఇతర చిన్న జీవులను వేటాడటం వీటి ప్రధాన ప్రత్యేకత. ఒక ప్రాంతంలో గుడ్లగూబల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ ఎలుకల నియంత్రణకు సహజంగా సహాయపడే అవకాశం ఉంటుంది.
రైతులకు గుడ్లగూబలు చేసే మరో ముఖ్యమైన మేలు పంట రక్షణ. ఎలుకలు వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలను నాశనం చేయడంతో పాటు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యానికీ నష్టం కలిగిస్తాయి. గుడ్లగూబలు వాటిని వేటాడటం వల్ల ఎలుకల సంఖ్యను సహజంగా తగ్గించడంలో సహకరిస్తాయి. దీంతో రసాయన ఎలుకల మందులపై ఆధారపడాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది.
టైటా గుడ్లగూబ శుభమా, అశుభమా?
అయితే గుడ్లగూబలను చూసినప్పుడు శుభమా, అశుభమా అనే నమ్మకాలు కూడా సమాజంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుడ్లగూబ ఇంటి సమీపంలో కనిపిస్తే అశుభానికి సంకేతంగా భావిస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో మాత్రం గుడ్లగూబను సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావించే నమ్మకం ఉంది. అందువల్ల దాన్ని శుభప్రదమైనదిగా చూసే వారూ ఉన్నారు. అయితే గుడ్లగూబ కనిపించడం వల్ల భవిష్యత్తులో శుభం లేదా అశుభం జరుగుతుందనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన మాంసాహార పక్షులు మాత్రమే. అందుకే గుడ్లగూబలను భయపడకుండా వాటి సహజ ఆవాసాలను కాపాడటం, వాటిని హింసించకుండా సంరక్షించడం పర్యావరణానికీ, వ్యవసాయానికీ ఎంతో మేలు చేస్తుంది.