Headlines

వివాదం మార్చిన కెరీర్.. క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా? | Zimbabwe Cricketer Travis Friend Makes Career Shift to Qatar Airways Captain


Cricketer Turned Pilot: మైదానంలో బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఓ మాజీ క్రికెటర్‌.. ప్రస్తుతం వేల అడుగుల ఎత్తులో విమానానికి సారథిగా వ్యవహరిస్తున్నాడు. జింబాబ్వే మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌ ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌ క్రికెట్‌కు దూరమైన తర్వాత విమానయాన రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 1981 జనవరి 7న జింబాబ్వేలోని క్వెక్‌వేలో జన్మించిన ట్రావిస్‌ జాన్‌ ఫ్రెండ్‌.. పొడవైన శరీరాకృతితో, వేగంగా బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే క్రికెట్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

2000లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2001లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. తక్కువ సమయంలోనే జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.

51 వన్డేలు.. 13 టెస్టులు

ట్రావిస్‌ ఫ్రెండ్‌ జింబాబ్వే తరపున 13 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో బౌలింగ్‌తో 25 వికెట్లు సాధించడంతో పాటు బ్యాటింగ్‌లో 447 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

వన్డేల్లోనూ తన ఆల్‌రౌండ్‌ ప్రతిభను చాటాడు. 51 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, 548 పరుగులు సాధించాడు. వన్డేల్లోనూ అతడి ఖాతాలో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

రాజకీయ వివాదంతో కెరీర్‌కు బ్రేక్‌..

అయితే ట్రావిస్‌ ఫ్రెండ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ప్రయాణం అనుకున్నంత కాలం కొనసాగలేదు. 2004లో జింబాబ్వే క్రికెట్‌లో ఆటగాళ్లు, క్రికెట్‌ యూనియన్‌ మధ్య కాంట్రాక్టుల విషయంలో తీవ్ర వివాదం తలెత్తింది.

ఆ సమయంలో జింబాబ్వే క్రికెట్‌లో నెలకొన్న రాజకీయ, పరిపాలనా పరిస్థితుల నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల్లో ట్రావిస్‌ ఫ్రెండ్‌ కూడా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత అతడికి జింబాబ్వే జట్టులో తిరిగి అవకాశం రాలేదు.

మైదానం నుంచి కాక్‌పిట్‌ వరకు..

క్రికెట్‌ కెరీర్‌కు అనూహ్యంగా ముగింపు పలికిన తర్వాత ట్రావిస్‌ ఫ్రెండ్‌ తన జీవితానికి కొత్త దిశను ఎంచుకున్నాడు. ఆకాశంలో విహరించాలనే లక్ష్యంతో విమానయాన రంగంలోకి అడుగుపెట్టాడు.

పైలట్‌గా మారేందుకు అవసరమైన శిక్షణ, అర్హతలు పూర్తి చేసుకున్నాడు. అనంతరం కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. క్రికెట్‌ మైదానంలో బౌలింగ్‌ చేసిన అతడి చేతులే ఇప్పుడు భారీ ప్రయాణికుల విమానాన్ని నడిపిస్తున్నాయి.

ఇప్పుడు ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కెప్టెన్‌..

ట్రావిస్‌ ఫ్రెండ్‌ ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థ ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో కమర్షియల్‌ ఎయిర్‌లైన్‌ కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు అతడి ప్రొఫెషనల్‌ వివరాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

ఒకప్పుడు జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ట్రావిస్‌.. ఇప్పుడు ప్రయాణికుల విమానానికి కెప్టెన్‌గా వేల అడుగుల ఎత్తులో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

క్రికెట్‌ తర్వాత మరో ఇన్నింగ్స్‌..

క్రికెట్‌ కెరీర్‌ అనూహ్యంగా ముగిసినప్పటికీ ట్రావిస్‌ ఫ్రెండ్‌ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఎదురైన పరిస్థితులను అధిగమించి మరో రంగంలో కెరీర్‌ను నిర్మించుకున్నాడు. మైదానంలో ఆల్‌రౌండర్‌గా రాణించిన ట్రావిస్‌.. ఇప్పుడు ఆకాశంలో పైలట్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. క్రికెట్‌ మైదానం నుంచి విమాన కాక్‌పిట్‌ వరకు సాగిన అతడి ప్రయాణం.. కెరీర్‌లో మార్పు వచ్చినా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే కొత్త శిఖరాలను చేరుకోవచ్చని చాటుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *