Headlines

తుమ్మిడిహెట్టి ఎత్తుపై తెలంగాణ కీలక ప్రతిపాదన.. మహారాష్ట్రను ఒప్పించేందుకు రంగంలోకి సీఎం రేవంత్..! | Pranahita Chevella Project: Telangana Pushes Tummidihatti Barrage 152M Height, Negotiates 150M with Maharashtra


హైదరాబాద్: తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలకంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ నిర్మాణానికి 152 మీటర్ల ఎత్తును ప్రతిపాదించి.. కనీసం 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం సాధించాలన్న వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహెట్టి అంశంపై మంగళవారం (సెప్టెంబర్ 01) దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు, నిర్మాణ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ కసరత్తు చేసింది. అయితే తాజాగా 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనను ముందుగా మహారాష్ట్ర ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. చర్చల్లో భాగంగా చివరకు 150 మీటర్ల ఎత్తుకైనా మహారాష్ట్ర సమ్మతించేలా ప్రయత్నించనుంది.

రెండు బ్యారేజీల ప్రతిపాదన!

తుమ్మిడిహెట్టి ప్రాంతంలో వార్ధా, వెల్గంగా నదుల వద్ద బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. వార్ధా వద్ద సుమారు 867 మీటర్ల పొడవుతో 60 గేట్ల బ్యారేజీ, వెల్గంగా వద్ద 1,113.5 మీటర్ల పొడవుతో 77 గేట్ల బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ రెండు బ్యారేజీలను 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. నదీ ప్రవాహానికి అడ్డంగా బ్యారేజీలను నిర్మించే విధంగా డిజైన్‌ను రూపొందించి.. కేంద్ర జల సంఘంతో సంప్రదింపుల అనంతరం సర్వేలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

ముంపుపై నివేదిక

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టినా గ్రామాలు ముంపునకు గురికాకుండా ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే నదీగర్భ ప్రాంతం, పర్యావరణ పరిరక్షణ పరిధిలోని భూములపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. సుమారు 4,215 ఎకరాల నదీగర్భం, చాప్రాల ఎకో సెన్సిటివ్ జోన్‌కు చెందిన 943 ఎకరాల ప్రాంతం నీటిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అవసరమైన భూసేకరణను సుమారు 1,018 ఎకరాలకు పరిమితం చేయవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది.

గతంలో 148 మీటర్లకు ఒప్పందం

తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 2016 మార్చి 8న ఒప్పందం జరిగింది. అప్పట్లో ఈ ప్రాజెక్టును 165 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ప్రాజెక్టుకు సంబంధించి హైడ్రాలజీ అనుమతి 2015 ఫిబ్రవరి 13న లభించింది. ఇరిగేషన్ ప్లానింగ్, అంతర్రాష్ట్ర అనుమతులు, మట్టి-నిర్మాణ సామగ్రి పరిశోధన, భూగర్భ జలాలు, వ్యవసాయానికి సంబంధించిన పలు అనుమతులు కూడా గతంలోనే వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మహారాష్ట్ర పరిధిలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తికాలేదని సమాచారం.

సీఎం స్థాయిలోనూ భేటీకి అవకాశం

ఇప్పటికే అందుబాటులో ఉన్న అనుమతులను ప్రస్తావిస్తూ మహారాష్ట్రను ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నించనున్నారు. మంగళవారం జరిగే అధికారుల సమావేశం తర్వాత అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోనూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీకి తెలంగాణ సీఎంవో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం కార్యాలయ కార్యదర్శి మాణిక్కరాజ్ కన్నన్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. 152 మీటర్ల ప్రతిపాదనతో చర్చ మొదలుపెట్టి.. 150 మీటర్ల ఎత్తుతోనైనా తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి పొందడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *