Headlines

యువ క్యాన్సర్ సర్వైవర్ల “డేటింగ్”.. రియాల్టీ షోకు ప్రేక్షకులు ఫిదా!


యువ క్యాన్సర్ సర్వైవర్ల “డేటింగ్”.. రియాల్టీ షోకు ప్రేక్షకులు ఫిదా!

సౌత్‌ కొరియాలోని సియోల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ (SBS) క్యాన్సర్‌ ఇతర ప్రాణాంతక వ్యాధులను జయించిన 20 నుంచి 30 ఏళ్ల వయసు వారి కోసం ఒక డేటింగ్‌ రియాలిటీ షోను ప్రసారం చేసింది. ‘లవ్‌ ఎగైనెస్ట్‌ టైమ్‌’ షోలో ప్రాణాంతక వ్యాధుల కారణంగా ప్రేమకు దూరంగా ఉన్న ఎనిమిది మంది యువతీయువకులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలను దాటిన వీరు, జీవితంలో అత్యంత విలువైనది ఏది, ఎలాంటి ప్రేమ కావాలనుకుంటున్నారు వంటి ప్రశ్నలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ షో లోని నైతికత అంశంపై మొదట్లో చర్చకు దారితీసింది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు.  సాధారణ డేటింగ్‌ షోల స్థానంలో ఈ షోను ఎవరూ పట్టించుకోరని విమర్శలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్‌ టాప్‌ 10 సిరీస్‌లో 7వ స్థానంలో నిలిచింది ఈ షో. ప్రాణాంతక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ప్రేమ,  జీవితం పట్ల యువత దృక్పథం మారిందనీ ఆ అంశాన్ని నిజాయితీగా చూపించినందుకు చైనీయులను కూడా ఈ షో విపరీతంగా ఆకట్టుకుంటుందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌  కథనంలో తెలిపింది.

ప్రాణాంతక వ్యాధులతో పోరాడి బయటపడిన, ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ సింగిల్‌గా ఉంటున్న యువతీయుకులను చూపించడం సాధారణ డేటింగ్‌ రియాలిటీ షోలకు వేరుగా ఉంది. అంతేకాదు వారు ఎదుర్కొనే  సవాళ్లు, ఇతరులతో అనుబంధాలను ఎలా తీర్చిదిద్దుకుంటారనేది ఈ షో తెలియచేస్తుంది. కిమ్‌ జోంగ్‌ యూన్‌ అనే యువకుడికి అగ్నిమాపక దళంలో ఫైర్ ఫైటర్ గా  ఉద్యోగం చేయాలనేది కల. ఏడాది కోచింగ్ తర్వాత పరీక రాసే సమయంలో అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకేమియా బయటపడింది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న తర్వాత కూడా మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. దానంగా పొందిన రోగనిరోధక కణాలు అతని ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేసాయి. దాంతో ఊపిరితిత్తులు, కీళ్లు, వేళ్ల పనితీరు క్షీణించిందని తెలిపాడు.

కిమ్‌ నా యంగ్‌ అనే యువతి తన ఎడమ చెవి వినిడికి శక్తిని కోల్పోయినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అకౌస్టిక్‌ న్యూరోమా చికిత్స తీసుకుంటున్నప్పుడు నెలలో 20 కేజీల బరువు పెరగడంతో చేయాలనుకున్న ఏ పనీ చేయలేకపోయాయని చెప్పింది. ఇకపై నా మనసు చెప్పినట్టు ప్రేమించడం, పని చేయడం, ఆనందించడం వంటివి చేస్తానని,  విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపింది. పోటీదారుల ఈ భావోద్వేగ కథనాలు వీక్షకుల హృదయాలను తాకాయి.

ఈ షోపై సోషల్‌ మీడియా లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్లామర్ కు దూరంగా మానవీయ కోణాన్ని చూపారని  పోస్టులు పెడుతున్నారు.  షోలో పాల్గొంటున్న వారు జాలిని కోరుకోరు, వారు జీవితం పట్ల ఆశతో, భాగస్వామిలో ఏది ముఖ్యమో అనే స్పష్టమైన క్లారిటీతో డేటింగ్‌ ప్రారంభిస్తారని నెటిజన్లు అంటున్నారు. తీవ్రమైన నొప్పి, బాధలను భరించినవారు ధైర్యంగా ముందుకొచ్చి తమ ప్రేమను  స్వీకరించడానికి, అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని చూపించిన ఈ  షో ఎంతగానో కదిలించిందని ఒక నెటిజన్ సోషల్‌ మీడియాలో కామెంట్ చేశారు. క్యాన్సర్ నిర్ధారణ అయినంత మాత్రాన ఎవరూ ప్రేమకు అనర్హులు కారు. ప్రేమ శారీరక రుగ్మతలకు అతీతమైంది.  అది రెండు మనసులను కలుపుతుంది అని మరొక నెటిజన్ పోస్టు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *