కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె.
స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు, 3 రెక్కల అనాసపువ్వు, కొద్దిగా జాపత్రి, 4 లవంగాలు, 3 స్పూన్ల ఎండుకొబ్బరి తురుము, 2 స్పూన్ల కసూరి మేతి.
మసాలా పేస్ట్ తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి జీడిపప్పు, ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, అనాసపువ్వు, జాపత్రి, లవంగాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత ఎండుకొబ్బరి పొడి వేసి మరో రెండు నిమిషాలు వేపాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి పాన్‌లోనే కసూరి మేతి వేసి కలపాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
చికెన్ ఫ్రై చేసే విధానం: కడాయిలో సరిపడా నూనె వేసి వేడెక్కాక సన్నని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఒక కిలో చికెన్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆపై మూతపెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికిస్తే చికెన్లోంచి నీరు ఊరుతుంది. ఆ నీరు కొద్దిగా ఇంకిపోయే వరకు ఉడికించి పసుపు, కారం వేసి నూనె తేలేవరకు 3-4 నిమిషాలు వేయించాలి.
అనంతరం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మసాలా పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు నిదానంగా మగ్గనివ్వాలి. అంతే, ఘుమఘుమలాడే చిక్కటి గ్రేవీ చికెన్ ఫ్రై సిద్ధం! పలావ్, బిర్యానీ లేదా వేడివేడి అన్నంతో తింటే ప్రతి ముద్ద ఎంతో కమ్మగా ఉంటుంది.




