నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, దెబ్బతిన్న ఇళ్లు, ఆప్తుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూ సూద్, ఇప్పుడు నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేపాల్‌ను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా, మనమందరం కలిసి నేపాల్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. బాధితులను ఆదుకునేందుకు సోనూ సూద్ నిత్యావసరాలు, సహాయక సామగ్రితో నేపాల్ రాజధాని కాఠ్మాండూకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు పంచుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
చిన్నారిని దత్తత తీసుకోవాలని భావించిన సోనూ సూద్
పునరావాస కేంద్రాల్లోని చిన్నారులను చూస్తుంటే మనసు ముక్కలవుతోందని, చాలా మంది పిల్లల తల్లిదండ్రులు వరదల్లో కనిపించకుండా పోయారని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ పునరావాస కేంద్రానికి వెళ్లినప్పుడు క్రిస్టినా అనే 8 ఏళ్ల చిన్నారిని కలిశానని, తమ్ముడితో ఉన్న ఆ పాప తన వైపు చూసి నవ్వుతూ ‘అంతా సర్దుకుంటుంది’ అని చెప్పిందని తెలిపారు. ఆ చిన్నారి తాను కారు ఎక్కే వరకు వెంటే ఉందని, ఆ పాపను దత్తత తీసుకోవాలనిపించిందని, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులమని, ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి కుటుంబాల కోసం కాస్త సమయం కేటాయించాలని సోనూ సూద్ కోరారు. విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడం కేవలం ప్రభుత్వం, మంత్రుల బాధ్యత మాత్రమే అనుకోవద్దని, ఒక మనిషిగా ఇది మనందరి బాధ్యతని గుర్తుచేశారు. వాళ్లు ఇళ్లను, కుటుంబాలను, బాల్యాన్ని కోల్పోయారని, మనమంతా కలిసి వారికి ఒక కొత్త జీవితాన్ని అందిద్దామని పేర్కొంటూ “నేపాల్.. నువ్వు ఒంటరివి కావు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
విపత్తు ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించిన సోనూ సూద్ అక్కడి దుస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అంచనా వేయలేమని, దగ్గరకు వెళ్లి చూస్తేనే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో అర్థమవుతుందని పోస్ట్ లో రాసుకొచ్చారు. విపత్తు జరిగిన ప్రాంతంలో వరద నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాల్సి వచ్చిందని అన్నారు. విపత్తు జరిగి వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం అక్కడి పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు అందించే సహాయంపై సోనూ సూద్ స్పందిస్తూ.. తన స్నేహితులు, బృంద సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ఏయే వస్తువులు, సేవలు అత్యవసరంగా కావాలో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నేపాల్‌లో సంభవించిన విపత్తులో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత మృతుల సంఖ్య 1,127కు చేరింది. దాదాపు 4,000 మంది ఆచూకీ ఇంకా లభించలేదని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్‌లు భారీ స్థాయిలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.