శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్మితమైన రామ మందిర పరిపాలనను మరింత వ్యవస్థీకృతం చేసేందుకు జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఇటీవల విరాళాలకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఈ నియామకానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన గతంలో ఏం చేశారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో జితేంద్ర మిశ్రా గురించి వీలైనంత సమాచారం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
38 ఏళ్లకు పైగా ఎయిర్ ఫోర్స్‌లో..
జితేంద్ర మిశ్రా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో నాలుగు దశాబ్దాలకు చేరువగా సేవలందించిన సీనియర్ అధికారి. ఎయిర్ మార్షల్ హోదాలో పదవీ విరమణ చేసిన ఆయన.. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా కూడా పనిచేశారు. ఆయన సేవలను గుర్తిస్తూ సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకం (SYSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM), విశిష్ట సేవా పతకం (VSM) వంటి పురస్కారాలు లభించాయి.
కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం
తన సుదీర్ఘ సర్వీస్‌లో జితేంద్ర మిశ్రా పలు కీలక కమాండ్, స్టాఫ్ పదవుల్లో పనిచేశారు. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ASTE)లో చీఫ్ టెస్ట్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించారు. రెండు ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌లకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా కూడా పనిచేశారు. అంతేకాకుండా డైరెక్టర్ (ఆపరేషనల్ ప్లానింగ్ అండ్ అసెస్‌మెంట్ గ్రూప్), ప్రిన్సిపల్ డైరెక్టర్ (ASR), ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), ASTE కమాండెంట్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కూడా సేవలందించారు. రామ మందిరం CEOగా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా పనిచేశారు.
ముగ్గురు కొత్త ట్రస్టీల నియామకం
రామ మందిర పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు కొత్త ధర్మకర్తలను నియమించింది. ఢిల్లీకి చెందిన మహేష్ భగచంద్కా, అయోధ్యకు చెందిన మదన్ మోహన్ పాండే, షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్‌లను కొత్త ట్రస్టీలుగా ఎంపిక చేసింది. మహేష్ భగచంద్కా దివంగత విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్‌కు బంధువుగా సమాచారం. కొత్త ట్రస్టీల నియామకాలతో పాటు జితేంద్ర మిశ్రాను తొలి CEOగా నియమించే అంశంపై కూడా ట్రస్ట్ కీలక సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సైనిక రంగంలో సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న మిశ్రా నియామకంతో రామ మందిర నిర్వహణ, పరిపాలన, విరాళాల వ్యవహారాల్లో మరింత క్రమబద్ధత తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది.