Headlines

హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి! | Hyderabad Traffic Relief: 3.32 Km Saidabad Steel Bridge Set to Ease Congestion


హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపేందుకు చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, సంతోష్‌నగర్‌, నల్గొండ ఎక్స్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు నిర్మించిన సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి కీలకంగా మారనుంది. నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP)లో భాగంగా సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించారు. సుమారు రూ.620 కోట్ల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను ఏర్పాటు చేశారు. చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్‌నగర్‌లోని యాదగిరి థియేటర్‌ వరకు ఇది విస్తరించింది. నాలుగు లేన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జికి 2020లో శంకుస్థాపన చేశారు.

ట్రాఫిక్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం

చార్మినార్‌, సంతోష్‌నగర్‌, ఛాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనదారులకు సైదాబాద్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా ఉండేది. ఉదయం, సాయంత్రం పీక్‌ అవర్స్‌లో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఈ సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జికి అక్బర్‌బాగ్‌ వద్ద ఒక అప్‌ ర్యాంప్‌, మరో మూడు డౌన్‌ ర్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నగరంలో 2.3 కిలోమీటర్ల పొడవుతో ఇందిరా పార్కు-వీఎస్‌టీ స్టీల్‌ బ్రిడ్జి పొడవైన వంతెనగా ఉంది. సైదాబాద్‌ బ్రిడ్జి 3.32 కిలోమీటర్ల పొడవుతో దానిని మించనుంది.

ఈ వంతెన అందుబాటులోకి వస్తే నల్గొండ ఎక్స్‌ రోడ్‌ నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్‌ వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో 40 నిమిషాలకు పైగా సమయం పడుతుండగా, బ్రిడ్జి ద్వారా సుమారు 15 నిమిషాల్లో ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే పాతబస్తీతో పాటు సంతోష్‌నగర్‌, మలక్‌పేట్‌, ఛాదర్‌ఘాట్‌ ప్రాంతాల ట్రాఫిక్‌ ప్రవాహంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ సమయం, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ రవాణా వ్యవస్థలో ఈ వంతెన మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *