మన శరీరం సహజంగా ఎలా డీటాక్స్ అవుతుంది? మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడానికి ఇప్పటికే లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు మరియు జీర్ణవ్యవస్థ 24 గంటలూ నిరంతరం పనిచేస్తున్నాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా, ఊపిరితిత్తులు శ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్ను, కాలేయం విష పదార్థాలను ప్రాసెస్ చేసి బయటకు పంపుతాయి. డీటాక్స్ వాటర్ తాగిన వెంటనే టాక్సిన్లు కరిగిపోతాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
డీటాక్స్ వాటర్ వల్ల అసలైన ప్రయోజనాలు: మొదటిది రోజూ చప్పగా ఉండే సాధారణ నీటిని తాగలేని వారికి నిమ్మ, పుదీనా, కీరా ముక్కలు వేసిన నీరు మంచి ఫ్లేవర్‌ను ఇచ్చి రోజంతా ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహిస్తుంది.
రెండోవది ఎండలో లేదా దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులకు బదులుగా చల్లని కీరా-పుదీనా నీటిని తాగడం వల్ల అనవసర కేలరీలు తగ్గి బరువు అదుపులో ఉంటుంది. మూడవది సరిపడా నీరు తాగడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం తగ్గి చర్మం పొడిబారకుండా గ్లో వస్తుంది.
డీటాక్స్ వాటర్ అపోహలు: డీటాక్స్ వాటర్ నేరుగా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించదు. సమతుల్య ఆహారం, వ్యాయామం మాత్రమే కొవ్వును తగ్గిస్తాయి. పండ్లను నీటిలో నానబెట్టినంత మాత్రాన ఆ పండును నేరుగా తిన్నప్పుడు వచ్చే ఫైబర్, విటమిన్లు నీటిలోకి పూర్తిగా రావు.
థైరాయిడ్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి రోగాలను డీటాక్స్ వాటర్ నయం చేయలేదు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు సిట్రస్ వాటర్ తాగితే మంట పెరిగే అవకాశం ఉంది. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.




