Rohit Sharma: గత కొన్ని రోజులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేరంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. గురువారం జరిగిన రివ్యూ మీటింగ్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా మాట్లాడుతూ “రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు, ఇలాంటి పుకార్లకు తావివ్వకండి” అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రపంచకప్ టోర్నీల్లో హిట్ మ్యాన్ నమోదు చేసిన రికార్డులు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
రోహిత్ శర్మ ఇప్పటివరకు 2015, 2019, 2023 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తం 28 మ్యాచ్‌లలో 60.57 సగటుతో ఏకంగా 1575 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ (2278), విరాట్ కోహ్లీ (1795), రికీ పాంటింగ్ (1743) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు బాదగా, పాకిస్థాన్‌పై చేసిన 140 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది.
వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు రోహిత్ శర్మ పేరిట నమోదైంది. టోర్నీ చరిత్రలో ఏకంగా 7 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. డేవన్ వార్నర్, సచిన్ టెండూల్కర్ 6 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ లాంటి వేదికపై నిలకడగా సెంచరీలు సాధిస్తూ హిట్ మ్యాన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
సిక్సర్లు బాదడంలో రోహిత్ శర్మ అందరికంటే ముందున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధికంగా 54 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. కాలిస్ గేల్ 49 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ ఒక్కడికే సాధ్యమైంది. అంతేకాకుండా కెప్టెన్‌గా భారత జట్టుకు అతిపెద్ద విజయాన్ని అందించిన ఘనత కూడా రోహిత్‌కే దక్కుతుంది. 2023 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై 302 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించడంలో కెప్టెన్‌గా ప్రధాన పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..