Headlines

IRCTC చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం.. ధర ఎంతంటే? | IRCTC Chardham Yatra 2026: 13 Day Spiritual Tour from Bengaluru, Package Price and Full Details


IRCTC Chardham Yatra 2026 Telugu: హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాల దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి ప్రత్యేకంగా ‘చార్‌ధామ్ యాత్ర ఎక్స్ బెంగళూరు’ పేరుతో 12 రాత్రులు, 13 రోజుల ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌తో పాటు దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రల్లో హిమాలయ చార్‌ధామ్ యాత్ర ఒకటి. గర్వాల్ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ నాలుగు క్షేత్రాలు ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక వైభవానికి ప్రసిద్ధి చెందాయి. యమునా దేవికి అంకితమైన యమునోత్రి ఆలయం, గంగా మాత కొలువైన గంగోత్రి, పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్, శ్రీ బద్రీనారాయణుడు కొలువైన బద్రీనాథ్ ఆలయాలను ఈ ప్యాకేజీలో దర్శించుకోవచ్చు.

ఈ టూర్ సెప్టెంబర్ 21, 2026న బెంగళూరు నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 13 రోజుల యాత్రలో విమాన ప్రయాణంతో పాటు రోడ్డు మార్గంలో చార్‌ధామ్ క్షేత్రాలను సందర్శిస్తారు. బెంగళూరు నుంచి నోయిడాకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్‌కు ప్రయాణం ఉంటుంది. అనంతరం బర్కోట్, యమునోత్రి, ఉత్తరకాశి, గంగోత్రి, గుప్తకాశి/సీతాపూర్, కేదార్‌నాథ్, పాండుకేశ్వర్, బద్రీనాథ్, దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్ ప్రాంతాలను కవర్ చేస్తారు.

కేదార్‌నాథ్ దర్శనానికి సుమారు 15 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉండగా, యమునోత్రి వద్ద కూడా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ సొంత ఖర్చుతో డోలీ లేదా గుర్రం వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



ప్యాకేజీ ధరలు ఇలా..

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.73,750
  • డబుల్ ఆక్యుపెన్సీ: రూ.66,990
  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.65,900

ఈ ప్యాకేజీలో ఇండిగో ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, హోటల్ వసతి, నిర్ణీత భోజనం, స్థానిక సందర్శనాలు, ట్రాన్స్‌ఫర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, GST వంటివి ఉన్నాయి. అయితే హెలికాప్టర్, పోనీ, పల్లకి ఛార్జీలు, ఎంట్రీ టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

హిమాలయాల్లో వాతావరణం అనూహ్యంగా మారే అవకాశం ఉండటంతో భక్తులు ఉన్ని దుస్తులు, రెయిన్‌కోట్, విండ్చీటర్, వాటర్‌ప్రూఫ్ ట్రెక్కింగ్ షూస్, టార్చ్, గ్లౌవ్స్ వంటి అవసరమైన వస్తువులు వెంట తీసుకెళ్లాలని IRCTC సూచించింది. మొత్తం 24 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునే భక్తులకు ఇది ప్రత్యేక అవకాశంగా చెప్పవచ్చు.

ఐఆర్ సీటీసీ హిమాలయ ఛార్‌ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *