Headlines

ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో | One Leg, One Dream: 7 Year Old Girl’s Inspiring Journey to School Video Goes Viral


బలియా, సెప్టెంబర్‌ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా దెబ్బతింది. మెరుగైన వైద్యం అవసరమైనప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అప్పట్లో తగిన చికిత్స అందించలేకపోయారు. ప్రస్తుతం రాగిణి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.

పాఠశాలకు వెళ్లడం ఓ సవాల్..

రాగిణి పాఠశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఊతకర్ర లేదా ట్రైసైకిల్ లేదు. దీంతో ప్రతిరోజూ ఒంటికాలిపై గెంతుకుంటూ పాఠశాలకు చేరుకుంటోంది. మార్గమధ్యలో అలసిపోవడంతో తరచూ ఆగి విశ్రాంతి తీసుకుంటోంది. అయినప్పటికీ చదువుకోవాలన్న ఆసక్తితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. రాగిణి ఆలస్యంగా పాఠశాలలో చేరడంతో గతంలో ప్రభుత్వం అందించే ఓ పథకం ప్రయోజనాన్ని కోల్పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

స్పందించిన బలియా జిల్లా యంత్రాంగం

రాగిణి పరిస్థితికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో బలియా జిల్లా కలెక్టర్ మంగళ ప్రసాద్ సింగ్ స్పందించారు. ఆమె ఇంటికి వైకల్య సంక్షేమ శాఖ అధికారులు, వైద్యుల బృందాన్ని పంపించారు. రాగిణికి అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు హామీ ఇచ్చారు.

అంతేకాకుండా రాగిణికి కృత్రిమ కాలు (ప్రోస్తెటిక్ లెగ్) అందించేందుకు, పాఠశాలకు వెళ్లేందుకు ట్రైసైకిల్ సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం తెలిపింది. చదువుకోవాలన్న చిన్నారి రాగిణి పట్టుదల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సరైన సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందితే ఆమె విద్యాభ్యాసం మరింత సులభమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *