RCB: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మళ్లీ మారబోతోందా? యాజమాన్యం హక్కులు మారిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. ఇటీవలే ఆర్సీబీ ఫ్రాంచైజీ వంద శాతం వాటాలను ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి. చేతులు మారిన తర్వాత టీమ్ పేరు మళ్లీ మారుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పుకార్లకు ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా చెక్ పెట్టారు. యజమానులు మారినంత మాత్రాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్సీబీ అనేది ప్రపంచంలోనే ఒక గ్లోబల్ బ్రాండ్ అని, ఈ పేరు తమకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఆర్సీబీ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలతో సాగింది. విరాట్ కోహ్లీ సహా ఎంతోమంది దిగ్గజాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ దశాబ్దానికి పైగా ట్రోఫీ సాధించలేకపోయింది. ట్రోఫీలు గెలవకపోయినా జట్టుకు ఉన్న క్రేజ్ గానీ, అభిమానుల ఆదరణ గానీ ఎప్పుడూ తగ్గలేదు. ఐపీఎల్‌లోనే అత్యంత బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అభిమానుల ఈ నిరంతర మద్దతే జట్టుకు అసలైన ఆయుధంగా మారింది.
2025లో భారత యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో ఆర్సీబీ తలరాతే మారిపోయింది. పటీదార్ కెప్టెన్సీలో పద్దెనిమిదేళ్ల ట్రోఫీ కరువును తీరుస్తూ ఆర్సీబీ తొలిసారి ఐపిఎల్ టైటిల్ ముద్దాడింది. ఆ విజయ పరంపర అక్కడితో ఆగలేదు. ఐపీఎల్ 2026లోనూ అదే ఊపును కొనసాగిస్తూ వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వరుస ట్రోఫీల సాధనతో బెంగళూరు క్రికెట్ అభిమానుల సంబరాలు ఆంబరాన్నంటాయి.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త యజమానులు రావడంతో మరోసారి పేరు మారుతుందేమోనని సగటు అభిమాని కంగారు పడ్డాడు. ఆర్యమాన్ బిర్లా క్లారిటీతో బెంగళూరు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన జట్టు పేరు, లోగో మారకుండా అలాగే కొనసాగుతుండటంతో ఆర్సీబీ ఆర్మీ హర్షం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..