Headlines

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్ వేళ వైభవ్ సూర్యవంశీకి గంగూలీ స్పెషల్ గిఫ్ట్ | Vaibhav Sooryavanshi Sourav Ganguly Sends Special Gift to Young Star Ahead of Duleep Trophy Final


Vaibhav Sooryavanshi: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జట్టులో జోష్ నింపేలా ఆయన పంపిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టును ముందుకు నడిపిస్తున్న ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ బృందానికి సౌరవ్ గంగూలీ ప్రత్యేకంగా ఒక కేక్ పంపించారు. దానిపై ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ఇన్సిపిరేషన్ కలిగించే వ్యాఖ్యలు రాయించారు. “ఎవరూ కేవలం పాల్గొనడానికి ఫైనల్ మ్యాచ్‌లు ఆడరు, గెలవడానికే ఆడతారు. దూకుడుగా ఆడండి, ఒకరి కోసం ఒకరు నిలబడండి, ఈస్ట్ జోన్ గర్వపడేలా చేయండి. ట్రోఫీని ఇంటికి తీసుకురండి బాయ్స్” అని దాదా చెప్పుకొచ్చారు. దాదా పంపిన ఈ స్పెషల్ మెసేజ్ ఫైనల్ పోరుకు ముందు జట్టులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఈసారి దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగింది. బెంగళూరులో నార్త్ ఈస్ట్ జోన్‌పై జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సుదీప్ కుమార్ ఘరామీ, షాబాజ్ అహ్మద్ సెంచరీలతో పాటు అభిజిత్ సర్కార్, అనుకూల్ రాయ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ విజయాన్ని అందించారు. ఆ తర్వాత రజత్ పటీదార్ నాయకత్వంలోని సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్ బౌలింగ్ మెరుపులు, వైభవ్ సూర్యవంశీ 92 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ పుణ్యమా అని 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చారు. సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్‌తో టైటిల్ పోరు జరగనుంది.

ఫైనల్ మ్యాచ్ వేళ భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని సీఏబీ ఘనంగా సన్మానించింది. ఈ ఫైనల్ మ్యాచ్ షమీ కెరీర్‌లో 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. గంగూలీ తరఫున సీఏబీ కోశాధికారి సంజయ్ దాస్ 100వ సంఖ్యతో కూడిన ప్రత్యేక బెంగాల్ జెర్సీని షమీకి అందజేశారు. గంగూలీ సంతకం చేసిన మ్యాచ్ బాల్, వెండి జ్ఞాపికను కూడా బహుకరించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్ సీఏ) కార్యదర్శి యు.భగవాన్‌దాస్ రావు కూడా ఈ కార్యక్రమంలో షమీని సత్కరించారు.

ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఈస్ట్ జోన్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు. సీనియర్ బౌలర్లు షమీ, ముకేష్ కుమార్ జోడీ అనుభవం జట్టుకు పెద్ద కొండంత అండగా మారింది. ఫైనల్లో సౌత్ జోన్ సవాలును తిప్పికొట్టి ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఈస్ట్ జోన్ పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *