Headlines

మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసే పేరెంట్స్‌కు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారిని నమ్మారో అంతే.. | Marriage Scams: How Cyber Crooks Target Parents with Fake Matrimony Profiles


పెళ్లి కుదరాలి.. పిల్లల జీవితం బాగుండాలి.. అనే తల్లిదండ్రుల ఆశ పడుతుంటారు. తమ స్థాయికి మించి కూడా మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. బంధువులు తెలిసిన వారితో పాటు ఇటీవల కాలంలో మ్యాట్రీమోనీలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారా? పెళ్లి కుదిరిందానండీ.. మాది పలానా మ్యాట్రీమోనీ.. మీ అమ్మాయికి తగిన సంబంధాలు మావద్ద ఉన్నాయి. అబ్బాయి ప్రొఫైల్ పెట్టామంటారా.. అంటూ కేటుగాళ్లు ఫోన్ లో అడుగుతారు. తల్లిదండ్రులు ఆసక్తి చూపగానే వెంటనే వాట్సాప్‌లో ఓ అందమైన అబ్బాయి ఫొటో.. దాంతోపాటు ఆకట్టుకునే ప్రొఫైల్‌ పంపిస్తారు. ఎన్‌ఆర్‌ఐ.. డాక్టర్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. భారీ జీతం.. కోట్ల విలువైన ఆస్తులు అంటూ ప్రొఫైల్‌ను నమ్మేలా చేస్తారు. అబ్బాయి నచ్చాడని చెప్పగానే అసలు కథ మొదలవుతుంది.

రూ.5 వేలు కట్టండి.. నంబర్ ఇస్తాం..

అబ్బాయి నచ్చాడని చెప్పగానే అసలు కథ మొదలవుతుంది. మీ పేరు రిజిస్టర్‌ చేయాలంటే రూ.5 వేలు పంపండి. అబ్బాయి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్ ఇస్తాం. మరికొన్ని మంచి ప్రొఫైల్స్‌ కూడా పంపిస్తాం అంటూ నమ్మిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే ఆశతో తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తారు. డబ్బులు అందిన కొద్దిసేపటికే అబ్బాయి తల్లిదండ్రుల పేరుతో ఓ ఫోన్‌ నంబర్‌ ఇస్తారు. కానీ ఆ నంబర్‌కు కాల్‌ చేస్తే.. “ఈ నంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదు” అనే సమాధానం వస్తోంది. మ్యాట్రిమోనీకి ఫోన్‌ చేస్తే.. స్విచ్ఛాఫ్ వస్తుంది. వాట్సాప్‌లో పంపిన ప్రొఫైల్‌ లేదు.. ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తి లేడు.. డబ్బులు మాత్రం తిరిగి రాక తల్లిదండ్రులు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు.

అడ్వాన్స్‌ పేరుతో మరో దందా..

వీటితోపాటు మరో తరహాలోనూ ఈ మోసాలు జరుగుతున్నాయి. ముందుగా పేరున్న మ్యాట్రిమోనీ సంస్థల్లో కొంత మొత్తాన్ని చెల్లించి.. అక్కడి ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తారు. పక్కా వ్యూహంతో వారికి నచ్చిన ప్రొఫైల్స్ పట్టుకుని వేటకు బయలు దేరుతారు. ఎక్కువ కాలంగా సంబంధం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు.. వయసు దాటిపోతున్న యువతీ యువకులు.. రెండో పెళ్లి కోసం చూస్తున్నవారు.. ఇలా ప్రత్యేకంగా టార్గెట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత తామే మ్యాట్రిమోనీ నిర్వాహకులమని పరిచయం చేసుకుని.. మీకు మంచి సంబంధం కుదురుస్తాం అంటూ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అడ్వాన్స్‌ తీసుకుంటారు. డబ్బులు చేతికి వచ్చాక ఫోన్‌ ఎత్తరు. ఒకవేళ ఎత్తినా.. సంబంధం మాట్లాడుతున్నాం.. కొంత సమయం పడుతుంది అంటూ కాలయాపన చేస్తారు. చివరకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోతారు.

చిన్న మొత్తమే.. కానీ పెద్ద వల..

మ్యాట్రిమోనీ సంస్థల పేరుతో మోసగాళ్లు పక్కా వ్యూహంతో బాధితులను మోసం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు.. రూ.10 వేలు మాత్రమే తీసుకుంటారు. బాధితులు కూడా “ఇంత చిన్న మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇలాంటి వాళ్లు పదుల సంఖ్యలో.. వందల సంఖ్యలో కుటుంబాలను టార్గెట్‌ చేస్తే.. అదే పెద్ద మొత్తంగా మారుతుంది.

నానాటికి పెరుగుతున్న బాధితుల సంఖ్య..

ఈ తరహా మ్యాట్రిమోనీ కాల్స్‌ ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్న మొత్తాల్లోనే మోసం చేస్తుండటంతో చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అందుకే బయటకు కనిపించే కేసుల కంటే.. వాస్తవంగా మోసపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మ్యాట్రిమోనీ పేరుతో ఫోన్‌ వస్తే వెంటనే నమ్మొద్దని పోలీసులు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. సంస్థ పూర్తి వివరాలు తెలుసుకోవాలనీ, కార్యాలయ చిరునామా, సంప్రదింపు వివరాలు పరిశీలించాలనీ సూచిస్తున్నారు గుర్తింపు లేని వ్యక్తిగత నంబర్లకు డబ్బులు పంపకూడదనీ, అబ్బాయి, కుటుంబ సభ్యుల వివరాలను స్వతంత్రంగా తెలుసుకోవాలని, ఫొటోలు, ఉద్యోగం, ఆస్తుల వివరాలను మాత్రమే నమ్మకూడదనీ సైబర్ నిపుణులు చెబుతున్నారు తొందరపెట్టి డబ్బులు అడిగితే అప్రమత్తం కావాలనీ, మోసం జరిగితే చెల్లింపు వివరాలు, ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ చాట్స్‌, ప్రొఫైల్‌ ఫొటోలు భద్రపరచాలనీ సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *