జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ రెండు జాగిలాలు.. మనుషులు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాలు, ప్రమాదకర శిథిలాల మధ్యలోకి వెళ్లి మృతదేహాల వాసన పసిగట్టి గుర్తిస్తున్నాయి. విపత్తు సంభవించిన మొదటి రోజు నుంచీ రసువా జిల్లాలోని తైమూర్, ఘటికోలా ప్రాంతాల్లో మోహరించిన ఈ శునకాలు, ఇప్పటివరకు 26 మృతదేహాలతో పాటు కొన్ని శరీర భాగాలను వెలికితీయడంలో సహాయక బృందాలకు సహకరించాయి. రాఖీ, జంబోతో పాటు కాఠ్మాండూ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ‘లియో’, ‘కలు’ లాబ్రడార్ శునకాలను మృతదేహాల అన్వేషణకు వినియోగిస్తున్నారు.
26 మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ శునకాలు
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోని శిథిలాలు, బురదలో గాలింపు చేపట్టిన ఈ జాగిలాలు.. ఇప్పటివరకు మొత్తంగా 26 మృతదేహాలతో పాటు పలు శరీర భాగాలను విజయవంతంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు సులభంగా చేరుకోలేని ప్రమాదకర ప్రాంతాల్లో సైతం ఈ శునకాలు పట్టుదలగా పనిచేసి, మృతదేహాలను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు ప్రశంసించారు.
అమ్మానాన్న కోసం 12 ఏళ్ల చిన్నారి ఎదురుచూపులు
కాఠ్మాండూలోని ఓ పునరావాస కేంద్రంలో ఉన్న 12 ఏళ్ల త్సేరింగ్ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆ గదిలో ఉన్న అందరికీ తెలిసిన ఆ నిజం.. ఆ పసివాడికి మాత్రం ఇంకా తెలియదు. తన తల్లిదండ్రులు ఎప్పటికీ తిరిగి రారనే విషయం ఆ చిన్నారికి ఇంకా అర్థం కావడం లేదు.
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో గ్లేసియర్ మంచు కొండలు, భారీ బండరాళ్లు విరిగిపడి ఉప్పొంగిన వరదలు నేపాల్ ను అతలాకుతలం చేశాయి. ఆ భీకర ప్రళయంలో వందలాది నివాసాలు తుడిచిపెట్టుకుపోగా, 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది.
Nepal Boy 12 Year Old Tsering
ఈ పెను విపత్తులో తన తల్లిదండ్రులను కోల్పోయిన త్సేరింగ్.. ప్రస్తుతం కాఠ్మాండూలో తన నానమ్మ, మేనత్త మింగ్మార్ డోల్మాతో కలిసి ఉంటున్నాడు. నిరాశ్రయులైన వందలాది మంది బాధితులతో పాటు ఈ బాలుడు కూడా తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, దిక్కు తోచని స్థితిలో రోజులు గడుపుతున్నాడు.
చంటి పిల్లలకు ప్రత్యేక ఆహారం అందక ఇబ్బందులు
పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. శిశువులకు కావాల్సిన ప్రత్యేక పాలు, ఆహారం దొరకక పెద్దలు తినే అన్నం, ఇతర పదార్థాలనే తినిపించాల్సిన దుస్థితి నెలకొందని తల్లులు వాపోతున్నారు. రద్దీగా ఉండే ఈ పునరావాస కేంద్రాల్లో తల్లులు తమ పసిబిడ్డలకు పాలివ్వడానికి కూడా తగిన గోప్యత (ప్రైవసీ) లేక అల్లాడిపోతున్నారు. దెబ్బతిన్న రోడ్లు, కరెంట్ కోతలు, సరైన వైద్యం అందక గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.