Headlines

Tirumala: తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా పెంపు | Tirumala devotees insurance accident cover raised to rs 10 lakhs


శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమానికి టీటీడీ పాలకమండలి పెద్దపీట వేసింది. భక్తులకు ప్రమాద బీమాను పెంచడంతో పాటు.. సహజ మరణానికి కూడా బీమా సదుపాయం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు.

సమావేశం అనంతరం టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లను చైర్మన్‌, పాలకమండలి సభ్యులు, ఈఓ విడుదల చేశారు.

భక్తులకు కీలక బీమా నిర్ణయాలు

దేశంలోనే తొలిసారిగా LIC ద్వారా శ్రీవారి భక్తులకు బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయం.

ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.

తిరుమలలో సహజ మరణం సంభవించిన భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం.

ఇందుకోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ పథకం కోసం LIC సంస్థకు టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం

CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు EHF సౌకర్యం కల్పిస్తూ రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు ఆమోదం.

టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం.

తిరుమలలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించాలని నిర్ణయం. ఇందుకోసం మూడేళ్లకు రూ.1.60 కోట్లు మంజూరు.

తిరుమలలోని FMSలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూ, వడ అందించాలని నిర్ణయం.

లడ్డూ తయారీకి అదనపు సిబ్బంది

శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ ఏడాది జరిగే సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కూడా బోర్డు చర్చించింది.

ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్

తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభాగాల వారీగా విభజించి, హైడ్రాలిక్‌ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్‌ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బయోగ్యాస్‌ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు.

ఆలయాల అభివృద్ధికి ఆమోదం

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం.

చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం.

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్ గడువును మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆమోదం.

దాతల సౌకర్యార్థం నామినీల మార్పుకు మరింత వెసులుబాటు కల్పిస్తూ నిబంధనల్లో సవరణకు ఆమోదం.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.49 కోట్ల ఆర్థిక సహాయంలో భాగంగా రూ.7.56 కోట్ల రెండో విడత నిధుల విడుదలకు ఆమోదం.

మొత్తంగా భక్తుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం, తిరుమలలో పారిశుధ్యం, అన్నప్రసాదం, ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *