UPSC Interview Questions Telugu: “వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి ఎలా పొందుతారు? లేదా ఎలా చదవాలి?”.. సాధారణంగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలా అనిపించినా, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థిని ఇదే ప్రశ్న ఎదురైంది. 2025 యూపీఎస్సీ పరీక్షలో 575వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఇంటర్వ్యూ బోర్డు ఈ ఊహించని ప్రశ్నను సంధించింది. తన గత ఉద్యోగం కార్పొరేట్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉండటంతో ఈ ప్రశ్న అడిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రశ్నకు తాను ఇచ్చిన సమాధానం, ఆ తర్వాత ఇంటర్వ్యూయర్ చేసిన సరదా వ్యాఖ్య ఇంటర్వ్యూ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసిందని అభ్యర్థి గుర్తుచేసుకున్నారు.
రెండో ప్రయత్నంలో 575వ ర్యాంకు
సదరు అభ్యర్థి 2024లో తొలిసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో విజయం సాధించి ఇంటర్వ్యూ వరకు చేరుకున్నప్పటికీ తుది జాబితాలో చోటు దక్కలేదు. అయినా పట్టుదల కోల్పోకుండా మరోసారి పరీక్షకు సిద్ధమయ్యారు. 2025లో నిర్వహించిన పరీక్షలో 575వ ర్యాంకు సాధించారు. యూపీఎస్సీకి సిద్ధమయ్యే ముందు ఆయన కార్పొరేట్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో పనిచేశారు. సివిల్ సర్వీసెస్‌పై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి పూర్తిస్థాయిలో పరీక్షకు సిద్ధమయ్యారు.
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌పై ప్రశ్న
తన రెండో యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనుభవాన్ని గుర్తుచేసుకున్న అభ్యర్థి.. ప్రారంభంలో సాధారణ ప్రశ్నలే అడిగారని చెప్పారు. అయితే కొంతసేపటి తర్వాత తన గత ఉద్యోగాన్ని ప్రస్తావించిన ఓ ఇంటర్వ్యూయర్ ఒక్కసారిగా వాట్సాప్‌కు సంబంధించిన ప్రశ్న వేశారని తెలిపారు. “వాట్సాప్‌లో ఒకసారి మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత దాన్ని తిరిగి పొందేందుకు ఏదైనా ఫీచర్ ఉందా?” అని ప్రశ్నించినట్లు చెప్పారు.
ఈ ప్రశ్న విన్నప్పుడు తాను తొలుత కొద్దిగా నవ్వానని అభ్యర్థి తెలిపారు. అనంతరం తనకు తెలిసిన మేరకు సమాధానం ఇచ్చారు. వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను సాధారణంగా నేరుగా తిరిగి పొందేందుకు ప్రత్యేకమైన ఫీచర్ లేదని, అయితే బ్యాకప్ వంటి మార్గాల ద్వారా కొన్ని సందర్భాల్లో పాత సందేశాలను తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో ఇంటర్వ్యూయర్ మరో ప్రశ్న అడిగారు. “అయితే వాటిని ఎలా తిరిగి పొందవచ్చు?” అని ప్రశ్నించడంతో తనకు తెలిసిన సాంకేతిక విధానాలను వివరించానన్నారు.
అప్పుడు మరో ఇంటర్వ్యూయర్ సరదాగా స్పందిస్తూ, “బహుశా మీరు దీన్ని ఏదైనా రహస్య ప్రాజెక్ట్ కోసం చేసి ఉంటారేమో.. అందుకే వివరంగా చెప్పడం లేదేమో” అంటూ చమత్కరించినట్లు సదరు అభ్యర్థి తెలిపారు. దీంతో ఇంటర్వ్యూ బోర్డులో నవ్వులు పూశాయని, వాతావరణం ఒక్కసారిగా సరదాగా మారిందని చెప్పారు.
యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా.. అభ్యర్థి సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించే తీరు వంటి అంశాలను కూడా పరిశీలిస్తారనడానికి సదరు అభ్యర్థి అనుభవం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.