భారతీయ రైల్వేలను ఆధునీకరించి, ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 8 భారీ మల్టీట్రాకింగ్ లైన్లకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.20,804 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులన్నింటినీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలనేది రైల్వేశాఖ ప్రణాళిక. ఇందులో సింహభాగం ప్రాజెక్టులు దక్షిణాదికే దక్కడం విశేషం.
తెలంగాణ రవాణా రంగానికి కొత్త దన్ను- ఘట్కేసర్–కాజీపేట 4వ లైన్
హైదరాబాద్–వరంగల్ కారిడార్‌లో ఏళ్ల తరబడి నెలకొన్న రద్దీ సమస్యకు పరిష్కారంగా ఘట్కేసర్ నుండి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల మేర 4వ ట్రాక్ నిర్మాణాన్ని కేంద్రం ఖరారు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా రూ.2,419 కోట్లను కేటాయించింది. ప్రధాన నగరాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఈ ప్రాజెక్ట్ ఒక తీపి కబురు. సింగిల్, డబుల్ ట్రాక్ వల్ల రైళ్లు నిలిచిపోయే పరిస్థితి తప్పుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, భువనగిరి వంటి ప్రాంతాలకు చేరడం సులువవుతుంది. బొగ్గు, ఎరువులు, పెట్రోలియం, ఆహార ధాన్యాల రవాణా వేగవంతమై తెలంగాణ వాణిజ్య రంగానికి కొత్త బలం చేకూరుతుంది.
దక్షిణ భారతంలో రూపురేఖలు మారనున్న 5 మార్గాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పరిధిలోని 17 జిల్లాలను కలుపుతూ 5 ప్రత్యేక లైన్లను విస్తరిస్తున్నారు.
- ఘట్కేసర్ – కాజీపేట (తెలంగాణ): 110 కి.మీల 4వ లైన్
- అరక్కోణం – రేణిగుంట (ఏపీ/తమిళనాడు): 77 కి.మీ పరిధిలో 3, 4వ లైన్లు
- వైట్‌ఫీల్డ్ – బంగారపేట (కర్ణాటక): 47 కి.మీ మేర 3, 4వ ట్రాక్‌లు.
- హోసూరు – ఓమలూరు (తమిళనాడు): 147 కి.మీ డబ్లింగ్ పనులు.
- సేలం – కరూర్ – దిండిగల్ (తమిళనాడు): 159 కి.మీ డబ్లింగ్ ప్రాజెక్ట్.
పర్యావరణానికి వరం.. 52 లక్షల మందికి మేలు
ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రైలు సదుపాయం పెరగడంతో పాటు రోడ్డుపై సరకు లారీల రద్దీ తగ్గుతుంది. ఫలితంగా 2,121 గ్రామాలకు నేరుగా రైలు మార్గం అనుసంధానమవుతుంది. రోడ్డు మార్గంపై ఒత్తిడి తగ్గి, ఏటా 8 కోట్ల లీటర్ల విలువైన ఇంధనం ఆదా అవుతుంది. వాతావరణంలోకి విడుదలయ్యే 42 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు నియంత్రణలోకి వస్తాయి. ఇది సుమారు రెండు కోట్ల చెట్లను నాటడంతో సమానమైన పర్యావరణ ప్రయోజనం. రోడ్డు రవాణాతో పోలిస్తే రైల్వేల ద్వారా సరకు రవాణా చౌక కావడంతో వ్యాపార వ్యయం తగ్గి అంతిమంగా వినియోగదారులకే మేలు జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.