Headlines

తిప్పేశ్వర్ టు కవ్వాల్: పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా? | Why Are Tigers Reaching Kawal but Not Staying? The New Tiger Corridor From Tipeshwar to Telangana


మహారాష్ట్ర పులులకు అడ్డా.. మాములు పులుల సంచారం కంటే మ్యాన్ ఈటర్ ల సంచారమే అక్కడ ఎక్కువ అన్నట్టుగా మారింది ఆ రాష్ట్రంలోని‌ పరిస్థితి. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల్లో తడోబా అందేరి టైగర్ జోన్ లోనే ఎక్కువ మ్యాన్ ఈటర్ ల సంచారం ఉన్నట్టుగా ఎన్టీసీఏ గుర్తించింది. కారణం పులుల సంఖ్య ఆ ప్రాంతంలో గణనీయంగా పెరగడం.. పులికి ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడటం, తప్పని పరిస్థితుల్లో ఆహారం వెతుక్కుంటూ ఆవాసం కోసం వలస వెళుతున్న పులులు అటవీ సమీప గ్రామాల్లోని పశువులపై దాడులు చేయడం అక్కడితో ఆగకుండా మనుషులను‌ సైతం హతమార్చడం ఇప్పుడు ఆ టైగర్ జోన్ లో పరిపాటిగా మారింది. అయితే, తడోబా అభయారణ్యానికి ఆనుకుని ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కవ్వాల్ అభయారణ్యంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చూద్దామన్న కవ్వాల్ టైగర్ జోన్ లో ఒక్కటంటే ఒక్క పులి కనిపించడం లేదు. తడోబా , తిప్పేశ్వర్ అభయారణ్యాల నుండి వలస వస్తున్న పులి కవ్వాల్ అభయారణ్యం లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించడం.. తిరిగి వచ్చిన చోటికే వెళ్లిపోవడం గత దశాబ్ద కాలం గా కొనసాగుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఓ సమాచారం ఇటు కవ్వాల్ టైగర్ జోన్ , అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవిశాఖకు గుడ్ న్యూస్ లా మారింది. అదే తిప్పేశ్వర్ టూ కవ్వాల్‌.. పులుల కొత్త వలస బాట.

తిప్పేశ్వర్ టూ కవ్వాల్ వయా బోథ్, సొనాల..

అడవిలో పులి అడుగుపెట్టింది అంటేనే ఓ సంచలనం. కానీ.. ఇప్పుడు ఆదిలాబాద్‌ అడవుల్లో పులి రావడం కంటే.. ఎక్కడి నుంచి వస్తోంది..? ఎక్కడికి వెళ్తోంది..? ఎక్కడ ఆగుతుంది అన్నదే అసలు ఆసక్తికరమైన చర్చ. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ నుంచి బయలుదేరిన పెద్దపులులు.. పెన్‌గంగ నది దాటి తెలంగాణలోకి ఎంటరవుతున్నాయి. అలా ప్రయాణం సాగించి బోథ్‌.. సొనాల అడవుల్లో అడుగుపెడుతున్నాయి. గతంలోలా వలస వచ్చిన రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోకుండా ఇక్కడే నెలలు నెలలు గడుపుతున్నాయి. ఇప్పుడు ఈ సమాచారం అటవిశాఖను సంబ్రమాశ్చర్యలకు గురి చేస్తుంది. అలా వలస వచ్చిన పులులు కవ్వాల్ టైగర్ జోన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే జాతీయ రహదారి 44 , వ్యవసాయ క్షేత్రాలు, మనుషుల అలజడి తో తమ దిశను మార్చుకుని మళ్లీ వెనక్కి వెళుతున్నాయి.

ఇవి కూడా చదవండి



అయితే కవ్వాల్ టైగర్ జోన్ పరిదిలో పులికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రకృతి సిద్దంగానే ఉన్నా.. అసలు ఈ చోటుకి పులి చేరే దారే అడ్డంకిగా మారుతుంది. అభయారణ్యంలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పులు వేటకు కావాల్సిన జంతువులు ఉన్నాయి.. దట్టమైన అడవులు ఉన్నాయి.. కొండగుట్టలు ఉన్నాయి.. కానీ‌, వలస వచ్చిన పులి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. దట్టమైన కవ్వాల్ లోకి రాకపోకలు సాగించే దారే బెబ్బులికి ప్రాణసంకటంగా మారిందని సమాచారం‌.

తిప్పేశ్వర్‌ టూ కవ్వాల్‌.. ఇదే పులుల కొత్త రూట్‌!

గతంలో మహారాష్ట్రలోని తడోభా అందేరి అభయారణ్యం నుండి బెబ్బులి పెద్ద వాగు , ప్రాణహిత నది దాటి కాగజ్ నగర్ కారిడార్ లో వలస రాగా.. తాజాగా పశ్చిమాన ఉన్న తిప్పేశ్వర్‌ వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయలుదేరిన పులులు.. పెన్‌గంగా నది దాటి.. ఆదిలాబాద్ జిల్లాలోని ఘన్పూర్‌.. చింతలబోరి.. చింతగూడ.. నేరేడుపల్లె.. కంటేగాం.. నిగిని.. మర్లపెల్లి.. అక్కడి నుంచి.. పిప్పలేరి.. నారాయణపూర్‌.. రఘునాథ్‌పూర్‌.. నాగాపూర్‌ అడవులు దాటుకుని.. చివరకు నిర్మల్‌ ఘాట్‌ మీదుగా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ వైపు పయనిస్తున్నాయి. ఈ నయా రహదారి తిప్పేశ్వర్‌ టూ కవ్వాల్‌.. వయా బోథ్‌–సొనాల పులుల సహజ వలస మార్గంగా మారిపోయింది. అయితే ఇలా పయనిస్తున్న బెబ్బులికి వేటగాళ్ల నుండి పెను ప్రమాదంపొంచి‌ ఉంది.

ఒకప్పుడు ఈ ప్రాంతంలో పులి అడుగుజాడ కనిపిస్తేనే అది పెద్ద వార్త. కానీ గత నాలుగేళ్లుగా తిప్పేశ్వర్ టూ ఆదిలాబాద్, నిర్మల్ అభయారణ్యం లో పరిస్థితి మారింది. గతంలో తిప్పేశ్వర్‌ నుంచి కవ్వాల్‌ వైపు కదిలే పులులు.. ఈ మార్గంలో రెండు మూడు రోజులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం సీన్‌ మారింది. 20 రోజులు.. 25 రోజులు.. కొన్ని సందర్భాల్లో 30 రోజుల వరకు ఇక్కడే తిష్ట వేస్తున్నాయి. అయితే అలా వస్తున్న పులుల ఇక్కడే తిష్టవేసేందుకు అటవిశాఖ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

పెద్దగూడ దగ్గర ‘టైగర్‌ క్రాసింగ్‌’..

పులి అడవిలో తిరిగినంత సేపూ పెద్దగా సమస్య ఉండదు. కానీ.. అడవి నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కితే.. ఇదే ఇప్పుడు అసలు టెన్షన్‌. పెద్దగూడ.. వజ్జర్‌ ప్రాంతాల్లో పులులు తమ సహజ వలస మార్గంలో వ్యవసాయ క్షేత్రాలు.. గ్రామీణ రహదారులు దాటాల్సి వస్తోంది. దీంతో మనిషి–వన్యప్రాణి ఘర్షణ ముప్పు పెరుగుతోంది. అందుకే కీలక రోడ్లపై అటవీశాఖ టైగర్‌ క్రాసింగ్‌ జోన్లు ఏర్పాటు చేసింది. వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున వేగం తగ్గించాలని సూచిస్తోంది. రైతులు కూడా పొలాల వద్ద ఒంటరిగా తిరగొద్దని హెచ్చరిస్తోంది. అంటే.. పులి కోసం అడవి దారి.. మనిషి కోసం రోడ్డు..
ఇద్దరి దారులు కలిసే చోటే ఇప్పుడు అసలు ప్రమాదం పొంచి ఉందన్న మాట.

కానీ అసలు ట్విస్ట్‌ ఇక్కడే..!

ఇంతకీ ఇన్ని పులులు ఉమ్మడి ఆదిలాబాద్ కు వలస వస్తున్నాయి కదా.. కవ్వాల్‌లోకి ఒక్క పులైనా ఎందుకు ఎంట్రీ ఇవ్వడం లేదు.. వచ్చినా వచ్చిన పులి వచ్చినట్టే ఎందుకు వెళ్లిపోతోంది. ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.
కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఏర్పడి 14 ఏళ్లు దాటింది. అడవిని పులి కోసం అన్ని విధాల సిద్ధం చేశారు. నీటి కోసం చెలమలు తవ్వారు. చెక్‌డ్యాంలు నిర్మించారు. పశుగ్రాసం పెంచారు. పులికి ఆహారమైన దుప్పులు.. కృష్ణజింకలు.. మచ్చల జింకలు.. మనుబోతులు.. కొండగొర్రెల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టారు. చివరికి రాంపూర్ , మైసంపేట లాంటి కవ్వాల్ టైగర్ జోన్ లోని గ్రామాలను పునరావాసానికి తరలించారు. ఏటా 5 నుండి 8 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేస్తున్నారు. అయినా.. కవ్వాల్‌లో పులి మాత్రం శాశ్వత చిరునామా’ఎంచుకోవడం లేదు.

2012లో టైగర్‌ జోన్‌.. కానీ పులి ఎక్కడ..?

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ను 2012 ఏప్రిల్‌ 10న ఏర్పాటు చేశారు. మొత్తం విస్తీర్ణం సుమారు 2,015 చదరపు కిలోమీటర్లు. అందులో.. కోర్‌ ఏరియా – 892 చ.కి.మీ. బఫర్‌ ఏరియా – 1,123 చ.కి.మీ. మహారాష్ట్రలోని తాడోబా.. తిప్పేశ్వర్‌.. కన్నెరగాం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి వంటి ప్రాంతాల నుంచి పులులు వలస వచ్చి కవ్వాల్‌లో స్థిరపడతాయని అటవీశాఖ అప్పట్లో గట్టిగానే అంచనా వేసింది. అనుకున్నట్టే పులులు వలస వచ్చాయి కూడా. కానీ వచ్చిన పులి వచ్చినట్టు వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యాయి. దీంతో మరొ పులి ఇటు వైపు రావడమే మానేసింది. 14 ఏళ్లు గడిచినా కవ్వాల్‌ అడవిలో పుట్టి పెరిగిన ఒక్కటంటే ఒక్క పులి కూడా రికార్డ్ లోకి ఎక్కలేక పోయింది. దీంతో పులి కోసం అటవిశాఖ ఆదివాసీ గ్రామాల్లో ఆంక్షలు మరింత కఠినతరం చేయడం కొత్త సమస్యలను తెర మీదకు తెచ్చింది.

పులి అభయారణ్యం లో ఆగలంటే.. స్థిరనివాసం ఏర్పాటు‌చేసుకోవాలంటే.. దానికి సరిపడా ఆహారం కావాలి.. సురక్షితమైన కారిడార్‌ కావాలి.. మనుషుల జోక్యం అత్యంత తక్కువగా ఉండాలి. శాఖాహార జంతువుల సంఖ్య పులి వేటకు తగ్గట్టుగా ఉండాలి. పులి అస్సలు ఆకలితో ఉండదు.. అది అడవిలో ప్రతి మూడు రోజులకోసారి వేటాడాల్సిందే. అందుకే కవ్వాల్‌లో పులి స్థిరపడాలంటే.. ఆహార జంతువుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

మరో వైపు.. తాడోబా.. ఇంద్రావతి.. తిప్పేశ్వర్‌.. కన్నెరగాం వంటి టైగర్‌ ప్రాజెక్టుల్లో పులుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ పులుల జనాభాపై ఒత్తిడి పెరిగిన కొద్దీ.. కొత్త ప్రాంతాల కోసం పులులు బయటకు రావడం సహజం. అదే సమయంలో కవ్వాల్‌ వైపు నీరు.. అడవి.. ఆహారం అందుబాటులోకి వస్తే.. పులుల వలసకు కవ్వాల్‌ మరోసారి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది. కానీ.. కవ్వాల్‌కు చేరే దారిలో 24 ప్రధాన అడ్డంకులున్నాయి. పులి కవ్వాల్ కు చేరేందుకు ఇది మరో పెద్ద సమస్య. మహారాష్ట్ర నుంచి బయలుదేరిన పులి.. ఆదిలాబాద్‌ మీదుగా కవ్వాల్‌ చేరాలంటే అనేక ప్రమాదకర ప్రాంతాలను దాటాల్సి ఉంటుంది. జాతీయ రహదారి 44.. మంచిర్యాల ప్రాంతంలోని మానవ ఆవాసాలు.. కొమురంభీం జిల్లాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనులు.. ఇలా సుమారు 24 కీలక అడ్డంకులు దాటాల్సిన పరిస్థితి ఉంది. అంటే.. పులి కవ్వాల్‌ చేరాలంటే అడవితో మాత్రమే పోరాడటం కాదు.. మనిషి నిర్మించిన అడ్డంకులతోనూ పోరాడాలి.

కవ్వాల్‌కు పులి రావడం లేదు కాదు.. అసలు ఆగడం లేదు. అంతే..!

ఇదే అసలు పాయింట్‌. పులులు కవ్వాల్‌ అభయారణ్యాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదు. వాటి అడుగులు ఈ దిశగా ఇప్పటికి పడుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి బోథ్‌.. సొనాల.. కాగజ్ నగర్.. పెంచికల్ పేట.. బెజ్జూర్ అడవుల్లోకి వలస వస్తున్నాయి. ఇక్కడ నెల రోజుల వరకు మకాం వేస్తున్నాయి. అంటే.. కవ్వాల్‌ వైపు వెళ్లే పులులకు ఈ ప్రాంతం నచ్చుతోంది. అడవిని కాపాడితే పులి వస్తుంది.. పులిని కాపాడితే అడవి బతుకుతుంది.

14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కవ్వాల్‌కు..

ఏదో ఒక రోజు పులి తప్పకుండా వస్తుంది.. స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఇది అటవిశాఖ ఇప్పటికి ఆశతో చెపుతున్న మాట. ‘టైగర్‌ ఆగయా!’ అనే సమాచారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది కవ్వాల్ టైగర్ జోన్.
ఎందుకంటే.. కవ్వాల్‌ అడవుల్లో పులి అడుగుపెట్టడం మాత్రమే కాదు.. ఇక్కడే తన పిల్లలను కని.. పెంచుకుంటేనే..
ఈ టైగర్‌ జోన్‌కు అసలైన మోక్షం. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *