Headlines

Pakistan Cricket: ఇంగ్లాండ్‌లో పాక్ క్రికెటర్లకు చేదు అనుభవం.. హోటల్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు | Pakistan u19 cricket team hotel surrounded by masked protestors in england


Pakistan Cricket: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పోర్ట్స్‌మౌత్‌లో పాక్ క్రికెటర్లు బస చేసిన ఫోర్ స్టార్ హోటల్‌ను ముసుగులు ధరించిన నిరసనకారులు ఒక్కసారిగా ముట్టడించారు. అక్రమ శరణార్థులుగా పొరబడటంతో జరిగిన ఈ నాటకీయ పరిణామం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఫర్హాన్ యూసఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. సెప్టెంబర్ 8న పోర్ట్స్‌మౌత్ నగరం లోని మేరియట్ హోటల్‌లో బస చేసిన పాక్ యంగ్ క్రికెటర్లు బయట నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖాలకు మాస్కులు, క్లాత్‌లు కప్పుకున్న పెద్ద సంఖ్యలో నిరసనకారులు హోటల్ బయట గుమిగూడారు. అక్కడ ఉన్న పాక్ ఆటగాళ్లను చూసి, ఇటీవలే పడవల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన శరణార్థులుగా భావించారు. హోటల్‌లో శరణార్థులకు వసతి కల్పిస్తున్నారనే భావనతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలపడం ప్రారంభించారు.

రంగంలోకి దిగిన స్థానిక ప్రజాప్రతినిధి

పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో సమాచారం అందుకున్న స్థానిక కౌన్సిలర్ జార్జ్ మాడ్‌గవిక్ హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఆయన హోటల్ మేనేజర్, పాక్ టీమ్ కోచ్, ఆటగాళ్లతో నేరుగా మాట్లాడారు. వారు నిజంగానే అంతర్జాతీయ క్రికెట్ జట్టు సభ్యులేనా అని నిర్ధారించుకోవడానికి గుర్తింపు కార్డులు చూశారు. ఆటగాళ్లు చూపించిన ప్రూఫ్స్ పరిశీలించిన తర్వాత, అక్కడ ఉన్నది శరణార్థులు కాదని, పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు ఆటగాళ్లని నిరసనకారులకు విడమరిచి చెప్పారు. ప్రజాప్రతినిధి వివరణ ఇవ్వడంతో నిరసనకారులు తమ పొరపాటును గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పొరపాటుకు దారితీసిన అసలు కారణం ఇదే

ఈ తీవ్ర గందరగోళానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. పోర్ట్స్‌మౌత్ నగరంలోకి శరణార్థులను తరలించేందుకు ఏ రవాణా సంస్థకు చెందిన బస్సులను ఉపయోగిస్తారో, సరిగ్గా అదే కంపెనీ బస్సులోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా హోటల్‌కు చేరుకుంది. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్‌లో అక్రమ శరణార్థుల అంశం చాలా సున్నితంగా మారింది. ఈ క్రమంలోనే ఆ ప్రత్యేక బస్సు నుంచి యువకులు హోటల్‌లోకి వెళ్లడం చూసిన స్థానికులు, వారిని శరణార్థులుగానే పొరబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి హోటల్ వైపు దూసుకొచ్చారు.

రంగంలోకి దిగిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అప్రమత్తమైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులను సంప్రదించి ఆటగాళ్ల క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఈసీబీ, పర్యటనలో ఉన్న పాక్ యువ ఆటగాళ్లకు భద్రతను మరింత పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం జట్టు బస చేసే ప్రదేశాల్లో సెక్యూరిటీని సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *