Headlines

అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు.. | One key opens hundreds of cabins in Norway where no roads, staff or reception exist, only trust


 

క్యాబిన్ లోపల రిసెప్షనిస్ట్,  వంటవాళ్లు ఉండరు.  వంట సామగ్రి, ఆహార పదార్థాల స్టాక్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటుంది. డి.ఎన్.టి. సంస్థ సభ్యత్వం తీసుకున్న ఎవరికైనా ఒక తాళం చెవి ఇస్తారు.  ఆ  ఒక్క తాళం చెవితో నార్వే అంతటా ఎక్కడ ప్రయాణించినా  వందలాది క్యాబిన్‌లను తెరవొచ్చు.   క్యాబిన్ లోపల ఫర్నిచర్ అంతా ఉంటుంది.  పర్వతారోహకులకు అవసరమైన మంచాలు, దుప్పట్లు, వంట చేయడానికి గ్యాస్ స్టవ్‌, చలి కాచుకోవడానికి కట్టెలు,  పాస్తా, సూప్ పౌడర్లు, క్యాన్డ్ ఫుడ్, ఓట్స్ వంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి.

సెల్ఫ్-సర్వీస్ క్యాబిన్‌లు

అక్కడ క్యాష్ కౌంటర్లు లేదా కాపలాదారులు ఉండరు.  ఎంత ఆహారం తిన్నారో, ఏ వస్తువులు వాడారో అక్కడ ఉన్న ఒక రిజిస్టర్ పుస్తకంలో రాయాలి. క్యాబిన్‌లు ఉండే చాలా ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ ఉండదు కాబట్టి, DNT క్యాబిన్ యాప్ ద్వారా సందర్శకులు తమ బస వివరాలను, కొనుగోళ్లను ఆఫ్‌లైన్‌లో నమోదు చేస్తారు.

ట్రిప్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ యాప్ ద్వారా బిల్లు చెల్లించి దానికి సంబంధించిన మొత్తాన్ని అసోసియేషన్‌కు చెల్లిస్తారు. ఈ వ్యవస్థ కారణంగా, హైకర్లు ఎలాంటి భారీ వంట సామగ్రిని, ఎక్కువ బరువున్న ఆహార సంచులను మోసుకెళ్లకుండా సులభంగా నార్వే పర్వతాలను అన్వేషించేలా వారికి ఏర్పాట్లు చేసింది డీఎన్ టీ సంస్థ. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కేవలం నమ్మకం,  పరస్పర సహకారం ఆధారంగా ఈ వ్యవస్థ దశాబ్దాలుగా కొనసాగుతోంది.

ప్యాంట్రీ షెల్ఫ్‌ల దగ్గర కాపలా ఉండటానికి క్యాషియర్ లేదా అటెండెంట్ ఎవరూ ఉండరు.  కాబట్టి సందర్శకులు తాము వాడిన ఆహారాన్ని నిజాయితీగా నమోదు చేయడం పైనే ఈ మొత్తం విధానం ఆధారపడి ఉంటుంది.  ఈ  సదుపాయాలు నార్వే పర్వతాల్లో హైకర్ల ప్రయాణాన్ని ఆనందమయం చేస్తాయి. నార్వే ప్రకృతి అందాలను తక్కువ ఖర్చుతో ఆస్వాదించే ప్రపంచ హైకర్ల కోసం 1868లో స్థాపించిన DNT (Den Norske Turistforening) సంస్థ  నేటికీ  నార్వే వ్యాప్తంగా పర్వత శ్రేణులు, అడవులు, తీర ప్రాంతాలు,  పురాతన వ్యవసాయ క్షేత్రాలలో ఆరు వందలకు పైగా DNT క్యాబిన్‌లను నిర్వహించడం విశేషం.  స్థానిక వాలంటీర్లు  ఈ వ్యవస్థ సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆహార పదార్థాల స్టాక్ ను నింపడం,  భవనాల మరమ్మత్తులను చూసుకుంటారు.

క్యాబిన్‌లో బస చేసే పర్వతారోహకులు క్యాబిన్ నిర్వహణ విషయంలో బాధ్యతగా ఉంటారు. నీరు తెచ్చుకోవడం, చెక్క పొయ్యిలో మంట వెలిగించి చలి కాచుకోవడం,  గిన్నెలు కడగడం స్వయంగా చేస్తారు.   క్యాబిన్ విడిచిపెట్టే ముందు పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వచ్చే వారి కోసం కొత్త కట్టెలను పేర్చి ఉంచుతారు. తమ లాగే బస చేయడం కోసం మరొకరు వస్తారు అనే భావనతో బాధ్యతాయుతంగా ఆ పని పూర్తి  చేస్తారు.  క్యాబిన్ ను తగిన విధంగా శుభ్రం చేసి వెళ్లడం పైనే ఈ వ్యవస్థ నడుస్తుంది.

నో-సర్వీస్ క్యాబిన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబ్బంది కానీ, ఆహార పదార్థాలు కానీ ఉండవు. కేవలం మంచాలు, కొన్ని వంట పాత్రలు  మాత్రమే ఉంటాయి. సందర్శకులు తమకు కావలసిన ఆహారాన్ని స్వయంగా తెచ్చుకోవాలి.

పూర్తిగా నమ్మకంపై ఆధారపడి నడిచే వ్యవస్థ

వందలాది తలుపులను తెరవడానికి ఒకే తాళం చెవి పని చేస్తుంది అనడం కంటే, ప్రతి తలుపు వెనుక ఉన్న నిశ్శబ్ద ఒప్పందం ఉందనేది ఈ వ్యవస్థ గొప్పతనం. అదేంటంటే.. మీకు కావలసింది తీసుకోండి,  ఏం తీసుకున్నారో నిజాయితీగా డబ్బులు చెల్లించండి, తిరిగి వెళ్లే ముందు తర్వాతి వారి కోసం బాధ్యతగా క్యాబిన్  శుభ్రం చేసి వెళ్లండి.  ఈ  నియమాలకు కట్టుబడి  150 సంవత్సరాలకు పైగా ఈ వ్యవస్థ నడుస్తోంది. నమ్మకం,   సామూహిక బాధ్యత అనే పునాదుల మీద వ్యవస్థకు ఇంకా ఊపిరి పోస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved @nationpulse.in 2026 Powered By BlazeThemes.