Headlines

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు ఈ భేటీలో పాల్గొననున్నాయి. ఆయా సంస్థల అఖిల భారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటన్ మంత్రులతో పాటు ముఖ్యమైన కార్యవర్గ సభ్యులు ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్, సక్షమ్, రాష్ట్రీయ సేవికా సమితి తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కానున్నారు.

సమావేశంలో చర్చించే ప్రధాన అంశాలు..

పరస్పర సమన్వయం: వివిధ రంగాల్లో పనిచేస్తున్న అనుబంధ సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని మరింత ప్రభావవంతంగా మార్చడం.

ప్రజా సంక్షేమం – విధాన నిర్ణయాలు: ప్రజారోగ్యం, సంక్షేమం, విధానపరమైన అంశాలపై చర్చలు జరపడం.

జనాభా అసమతుల్యత: దేశంలో జనాభా సమతుల్యత లోపించడం వల్ల కలిగే పరిణామాలపై సమీక్ష.

నశా ముక్తి: యువతను వ్యసనాల నుంచి దూరం చేసి, నవసమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడం.

పంచ పరివర్తన్ – భారతీయ అభివృద్ధి నమూనా: సమాజంలో ధార్మిక, సామాజిక మార్పుల కోసం పంచ పరివర్తన్ అమలు, దేశీయ దృక్పథంతో కూడిన అభివృద్ధి అంశాలపై లోతైన చర్చలు.

హాజరుకానున్న ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు

ఈ మూడు రోజుల సమన్వయ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పరమ పూజనీయ సర్సంగ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక మార్పు, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై ఈ భేటీలో దిశా నిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *